సూర్యపేట ప్రజల్ని కేసీఆర్ కోరిందేంటో తెలుసా?

Fri Oct 13 2017 11:30:40 GMT+0530 (IST)

ఊహించనిరీతిలో వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటే. తాజాగా తన తీరుతో సూర్యపేట ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేనా.. ఆయన కోరిక విన్న వారంతా తప్పనిసరిగా అని చెప్పేలా చేశారు. సాధారణంగా రాజకీయ నాయకుడు ఎవరైనా తాను చేయాల్సింది చిన్నది చేసినా.. తర్వాత అడిగేది తనకు ఓటు వేయాలనే. కానీ.. కేసీఆర్ అందరి మాదిరి కాదు.తానేం అడగాలో.. తానేం అడగకూడదో ఆయనకు క్లారిటీ ఎక్కువ. ప్రజల్ని అడిగే రీతిలో అడగాలన్నట్లుగా ఆయన తాజామాటలు ఉన్నాయని చెప్పాలి. సూర్యాపేటలో నిర్వహించిన బహిరంగ సభ.. డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్థిదారులతో మాట్లాడటం లాంటి తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా సూర్యపేట పట్టణ అభివృద్ధికి భారీ వరాలే ప్రకటించారు. రూ.65 కోట్లతో మూసీ నది ఆధునీకరణ.. రూ.75 కోట్లతో సూర్యాపేట పట్టణాభివృద్ధి లాంటివి ప్రకటించి వారిని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తాను ఇవ్వాల్సిన వరాలు ఇచ్చిన తర్వాత.. సూర్యాపేట ప్రజలు కోరని  వరాలు తాను చాలానే వరాలు ఇచ్చానని.. మరి నాకో వరం ఇస్తారా? అంటూ వారిని ప్రశ్నించారు.

కేసీఆర్ అంతటి అధినేత.. నోరు తెరిచి కోరిక కోరితే ఎవరు మాత్రం కాదంటారా? అందుకే.. ఏం కావాలంటూ భారీగా రియాక్ట్ అయ్యారు. మామూలుగా అయితే.. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ తమ పార్టీకి ఓటు వేయమని అడటం రోటీన్. అందుకు భిన్నంగా సూర్యాపేట ప్రజల్ని కేసీఆర్ కోరింది.. పట్టణంలోని ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లో ఆరు మొక్కలు నాటాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. ఏదో అడుగుతారని భావించిన సూర్యాపేట ప్రజలకు.. అందుకు భిన్నంగా కేసీఆర్ కోరిన కోర్కె విన్నవారంతా ఆయన మాటకు పిధా అయ్యారు.