Begin typing your search above and press return to search.

జంప్‌ జిలానీల కోసం టీఆరెస్ స్పెషల్ టీమ్‌

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:30 PM GMT
జంప్‌ జిలానీల కోసం టీఆరెస్ స్పెషల్ టీమ్‌
X
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టసాధ్యంగా మారింది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తుగడలకు ఇతర పార్టీల ముఖ్యనేతలు బెంబేలెతుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా అధికార పార్టీలోకి వలసగట్టడంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయ్యింది. మొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ రాజీనామా చేయగా.. నిన్న అదే టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకొన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలోని సగం మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరినట్లయ్యింది.

ఇక కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అనేకమంది ముఖ్య నేతలు పార్టీని వీడి అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. మాజీ పీసీసీ నేతలు కె.కేశవరావు - డి.శ్రీనివాస్ అధికార పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ కళతప్పింది. టీపీసీసీ అధ్యక్ష బాధ్యత నుంచి పొన్నాలను తప్పించినప్పటి నుంచి పార్టీనుంచి క్రమంగా వలసలు పెరిగాయి. టీపీసీసీ చీఫ్‌ గా పదవిని చేపట్టిన ఉత్తమ్‌ కుమార్ పార్టీలో సఖ్యత పెంచడంలో విఫలం చెందారు. పార్టీ శాసనసభ పక్ష నేత జానారెడ్డి, మండలి పక్ష నేత షబ్బీర్ అలీ లతోపాటు సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతారావు - గుత్తా సుఖేందర్‌ రెడ్డి - పొన్నాల లక్ష్మయ్య - రేణుకా చౌదరి - గీతారెడ్డి - దామోదర రాజ నర్సింహా తదితర ఉద్దండులున్న పార్టీ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమిత మయ్యింది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణలో తమ ప్రాభల్యాన్ని పెంచు కోవాలని చూసిన ఏఐసీసీ పెద్దలకు గులాబీ రథ సారథి కేసీఆర్ పెను సవాల్ గా మారారు. ప్రత్యేక రాష్ట్ర ఎన్నికల అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 22 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్రంలో తొలుత అధికారాన్ని చేపట్టిన టీఆర్ ఎస్ క్రమంగా పుంజుకుంటూ.. ఇతర పార్టీల నేతలకు వల వేశారు. తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఇతర పార్టీల నేతలను మెప్పించడంలో సీఎం కేసీఆర్ సఫలమయ్యారు. గత సంవత్సరం వరంగల్ లోకసభకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. దీంతో ఇతర పార్టీల నేతలంతా అధికార పార్టీలోకి జంప్ కావడానికి సిద్దపడ్డారు.

స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించింది. ముఖ్యంగా 5 స్థానాలకు పోటీ చేసేందుకు తమ పార్టీ తరపును అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి బీఫామ్ ఇచ్చిన తర్వాత నిజామాబాద్ - మెదక్ అభ్యర్థులు తమ నామినేషన్లను విరమించుకుని, అధికార పార్టీలో చేరడంతో కాంగ్రెస్ ముఖ్య నేతలు తెల్లమొహం వేశారు. దీంతో అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందని కాంగ్రెస్ నేతలు గగ్గోలుపెట్టారు. ప్రలోభం - అక్రమం - అన్యాయం - అరాచకం అంటూ నానా యాగీ చేసినా.. అధికార పక్షం తన వ్యూహం ప్రకారం ముందు కు సాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి 1 - కాంగ్రెస్‌ కు 2 - బీజేపీ 4 స్థానాలకే పరిమితమై పరువు పోగొట్టుకున్నాయి. ఇప్పుడు వారినీ... టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో మిగిలిన ఎమ్మెల్యేలను కూడా టీఆరెస్ లో కలుపుకొనేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రచించినట్లుగా తెలుస్తోంది. జంప్ జిలానీల కోసం ఆయన ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి వారు ఇదే పనిపై ఉండేలా ప్లాన్ చేసినట్లు వినిపిస్తోంది. అదే నిజమైతే... విపక్షాల్లో మరిన్ని వికెట్లు పడడం ఖాయం