Begin typing your search above and press return to search.

హోంగార్డుల‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:31 PM GMT
హోంగార్డుల‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రోమారు త‌న మార్కు వ‌రాలు ప్ర‌క‌టించారు. పోలీస్ శాఖ‌పై ఇప్ప‌టికే ప‌లు వ‌రాలు ప్ర‌క‌టించిన తెలంగాణ సీఎం ఈ శాఖ‌లోని హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు. హోంగార్డుల జీతం రూ.20 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఇక మీద ప్ర‌తి ఏడాది వెయ్యి రూపాయ‌ల ఇంక్రిమెంట్ కూడా ఇస్తామ‌ని చెప్పారు. ప్రగతిభవన్‌ లో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ హోంగార్డులతో సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డితో పాటు పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ వంటి నగరాల్లో హోంగార్డులు రూ.12వేల జీతంతో జీవనం సాగించడం కష్టమని సీఎం అన్నారు.

మన ఆదాయం అంతా మన ప్రజలకు చెందాలనే లక్ష్యంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని సీఎం స్పష్టం చేశారు. ఇక మీద‌ ప్రత్యేక కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రిజర్వ్‌డ్ కానిస్టేబుళ్ల నియామకంలో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. డ్రైవర్ల నియామకంలో హోంగార్డులకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. రోస్టర్ విధానం లేకుండా ఎలాంటి నియామక ప్రక్రియ జరగొద్దని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. రోస్టర్ అమలు చేస్తూనే హోంగార్డులపై నియామక అధికారులు కాస్త దయ చూపాలన్నారు. పరీక్ష కూడా సాధారణ అభ్యర్థులతో కాకుండా హోంగార్డులకు ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్దేశించారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే హోంగార్డులకు వయోపరిమితి 40 ఏళ్లకు పెంచుతామన్నారు. కమ్యూనికేషన్ విభాగంలో హోంగార్డులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తాంనమ‌ని ప్ర‌క‌టించారు.

ట్రాఫిక్ విభాగంలో ప‌నిచేసే రెగ్యూల‌ర్ కానిస్టేబుళ్ల‌కు ఇచ్చే అల‌వెన్సులు ఇక మీద అదే విభాగంలో ప‌నిచేసే హోంగార్డుల‌కు కూడా ఇస్తామ‌ని వెల్ల‌డించారు. పెంచిన అలవెన్సులు 2018 జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పారు. నగరంలో పనిచేసే హోంగార్డులకు బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తామని..18900 మంది హోంగార్డులకు కోరుకున్న చోట డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారు.

పోలీసు - హోంగార్డుల కుటుంబానికి మంచి వైద్య బీమా సదుపాయం కల్పిస్తామని సీఎం పేర్కొన్నారు. పోలీసు ఆస్పత్రుల్లో పోలీసులతో సమానంగా హోంగార్డులకు వైద్య సదుపాయాలు అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ మహిళా పోలీసులతో సమానంగా మహిళా హోంగార్డులకు 6 నెలల ప్రసూతి సెలవు ఇవ్వనున్నట్లు తెలిపారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరూ వెట్టి చాకిరీ చేయకూడదని సీఎం అన్నారు. ఎన్నో సమస్యలతో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఒక్కో సమస్యను క్రమానుగతంగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. చాలా విభాగాల్లో కాంట్రాక్టు - ఔట్ సోర్సింగ్ సిబ్బంది. వేలల్లో ఉన్నారు. అసలు పరిస్థితి మీకు అర్థం కావాలనే అందరినీ పిలిపించుకుని మాట్లాడుతున్నట్లు సీఎం కేసీఆర్ హోంగార్డులకు తెలిపారు.