ఒక్కదెబ్బతో కేసీఆర్ సెట్ రైట్

Mon May 27 2019 17:06:22 GMT+0530 (IST)

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలతో కేసీఆర్ కు బాగానే షాక్ తగిలినట్టు  కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు దిగుతున్నట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ముఖ్యంగా పార్టీ కోసం పాటుపడిన సీనియర్లను కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కాక పక్కకు పెట్టాడన్న ప్రచారం పార్టీ నేతలతోపాటు ప్రజల్లోనూ వ్యతిరేకత భావనను పెంచింది.అందుకే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 చోట్ల బీజేపీ - 3 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని విశ్లేషకులు కుండబద్దలు కొట్టారు. అందుకే కేసీఆర్ తాజాగా తిరుమల నుంచి రాగానే సాయంత్రం ఓ కీలక ప్రకటన చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే తెలంగాణలో నోటిఫికేషన్ వెలువడింది. మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన రాజీనామా చేయగా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. రేపటితో నామినేషన్లకు తుది గడువు.  దీంతో ఈ సాయంత్రం కేసీఆర్ ‘గుత్తా’ను ఎంపిక చేశారని.. సాయంత్రం ప్రకటిస్తారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇక ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయ్యే సీటులో గుత్తాను కాకుండా అక్కడ ఓడిపోయినా సైదారెడ్డికే మళ్లీ చాన్స్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలిసింది. సానుభూతి సైదారెడ్డికి కలిసివస్తుందని ఆశిస్తున్నారు.

గుత్తాను ఎమ్మెల్సీ చేసి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించడం.. మంత్రివర్గ విస్తరణలో హరీష్ కు చోటు కల్పించకపోవడం వంటి పరిణామాలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకే హరీష్ రావుతోపాటు సీనియర్ అయిన మంత్రివర్గ విస్తరణలో పక్కనపెట్టిన కడియం శ్రీహరికి కూడా ఈసారి మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

మొత్తం పార్లమెంట్ ఎన్నికల దెబ్బకు కేసీఆర్ సెట్ రైట్ అయ్యి మళ్లీ సీనియర్లకు మంత్రి పదవులు ఇచ్చేందుకు రెడీ కావడం పార్టీ సానుకూల వాతావరణం కల్పిస్తోంది.