Begin typing your search above and press return to search.

కేసీఆర్ అబద్ధాల కోరా?..ఆ మూవీ చెప్పిందిదేనా?

By:  Tupaki Desk   |   12 Jan 2019 11:04 AM GMT
కేసీఆర్ అబద్ధాల కోరా?..ఆ మూవీ చెప్పిందిదేనా?
X
ఇటు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్ లో... మొత్తంగా దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. ఆయా బ‌యోపిక్‌ల‌లో కీల‌క పాత్ర‌తో పాటుగా ఆ పాత్ర‌తో అనుబంధం ఉన్న నేత‌ల ప్ర‌స్తావన కూడా స‌ద‌రు చిత్రాల్లో త‌ప్ప‌నిస‌రే. మ‌రి ఈ ప్ర‌స్తావ‌న‌లు వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉంటే స‌రేస‌రే. లేదంటే వివాదాలే వివాదాలు. బ‌యోపిక్‌ ల‌లో వాస్త‌వాల‌ను చెప్పినా... కొంద‌రు నేత‌ల‌కు రుచించ‌డం లేదు. అస‌లు త‌మ అనుమ‌తి లేకుండా బయోపిక్‌ ల‌లో త‌మ‌ను ఎలా చూపిస్తారంటూ గ‌గ్గోలు పెడుతున్న నేత‌ల‌నూ మ‌నం చూస్తున్నాం. ఇందుకు నిద‌ర్శ‌నంగా టాలీవుడ్‌ లో ఇటీవ‌లే విడుద‌లైన ఎన్టీఆర్ బ‌యోపిక్‌ కు సంబంధించి సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - మాజీ సీఎం నాదెండ్ల భాస్క‌ర‌రావు ఉదంతాన్నే చెప్పుకోవాలి. ఎన్టీర్ బ‌యోపిక్ ను త‌న‌కు చూపించ‌కుండా విడుద‌ల చేస్తే... స‌హించేది లేద‌ని కూడా ఆయ‌న చిత్ర బృందంతో పాటుగా ఏకంగా సెన్సార్ బోర్డుకు కూడా తాఖీదులు పంపారు.

ఈ త‌ర‌హా ఇబ్బంది ఓ బాలీవుడ్ మూవీకి కూడా ఎదురయ్యే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఆ చిత్రం ఏదంటే... యూపీఏ పాల‌న‌లో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ వ్య‌వ‌హారమే ప్ర‌ధానాంశంగా రూపుదిద్దుకుంటున్న *యాక్సిడెంట‌ల్ ప్రైమ్ మినిస్ట‌ర్‌* చిత్ర‌మే. ఇప్ప‌టికే ఈ చిత్రంలో అభూత క‌ల్ప‌నల‌న్నీ చూపించి త‌మ‌ను దోషులుగా చూపిస్తున్నారంటూ గ్రాండ‌ఠ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ భ‌గ్గుమంటూ ఉంటే... తాజాగా ఈ సినిమాపైకి తెలంగాణ వాదులు కూడా దండెత్తే అవ‌కాశాలున్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర క‌నిపించ‌కున్నా... ఆయ‌న వ్య‌వ‌హార స‌ర‌ళిపై ఓ రెండు పాత్ర‌లు చ‌ర్చించుకున్న సీన్ ఒక‌టి ఉంద‌ట‌. ఈ సీన్ ఎలా ఉందో తెలియ‌దు గానీ... విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ప్ర‌కారం... ఈ సీన్ లో కేసీఆర్‌ ను అబద్ధాల కోరుగా చిత్రీక‌రించార‌ట‌. తెలంగాణ ఉద్య‌మ స‌యంలో నాడు అధికారంలో ఉన్న యూపీఏతో కేసీఆర్ ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చ‌ర్చ‌లు ఢిల్లీలో జ‌ర‌గ‌గా, వాటి వివ‌రాల‌ను కేసీఆర్ అటు ఢిల్లీతో పాటుగా ఇటు హైద‌రాబాదులోనూ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశాల్లోనూ ప్ర‌స్తావించారు.

అయితే ఈ త‌ర‌హా చ‌ర్చ‌లు ఏవీ జ‌ర‌గ‌లేద‌ని, కానీ కేసీఆర్ మాత్రం ఈ చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టుగా చెప్పుకునేవార‌ని ఆ చిత్రంలోని రెండు పాత్ర‌ల మ‌ధ్య తీసిన సీన్‌లో చెప్పుకొచ్చార‌ట‌. ఆ రెండు పాత్ర‌లు ఏవ‌న్న విష‌యానికి వ‌స్తే... సోనియా గాంధీ రాజ‌కీయ స‌ల‌హాదారు అహ్మ‌ద్ ప‌టేల్, నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మీడియా స‌ల‌హాదారు సంజ‌య్ బారు పాత్ర‌లు మాట్లాడుకునే స‌న్నివేశంలో కేసీఆర్ ప్ర‌స్తావ‌న వ‌స్తుంద‌ట‌. కేంద్రంతో కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌న‌ప్ప‌టికీ... యూపీఏ స‌ర్కారుతో తాను చ‌ర్చించిన‌ట్లుగా కేసీఆర్ చెప్పుకునే వార‌ని త‌మ‌ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లో ఆ రెండు పాత్ర‌లు చెబుతాయ‌ట‌. అంటే... తెలంగాణ ప్ర‌జ‌ల క‌ల‌ను సాకారం చేసిన కేసీఆర్‌ ను ఈ చిత్రంలో అబద్ధాల కోరుగా చిత్రీకరించార‌న్న మాట‌. ఇదే నిజ‌మైతే... ఈ చిత్రంపై తెలంగాణ ప్ర‌జ‌లు... ప్ర‌త్యేకించి టీఆర్ ఎస్ శ్రేణులు భ‌గ్గుమ‌నే అవ‌కాశాలున్నాయి.