Begin typing your search above and press return to search.

20 నెలల తర్వాత సిగ్గు పడటమేంటి కేసీఆర్?

By:  Tupaki Desk   |   7 Feb 2016 4:41 AM GMT
20 నెలల తర్వాత సిగ్గు పడటమేంటి కేసీఆర్?
X
అదేదో నిన్న కాక మొన్ననే అధికారంలోకి వచ్చినట్లు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా ఉద్యానశాఖ అధికారులతో జరిపిన రివ్యూ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలల తర్వాత అప్పుడే గుర్తించినట్లుగా ఒక విషయాన్ని ప్రస్తావించటమేకాదు.. ఆకుకూరలు కూడా పక్కరాష్ట్రాల నుంచి తెచ్చుకోవటం ఏమిటి? ఎంత సిగ్గుచేటని అగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం. మహానగరానికి సంబంధించి నిత్యం వినియోగించే పండ్లు.. కాయగూరలు.. ఆకు కూరలు.. పూలు అన్నీ పలు రాష్ట్రాల నుంచి తెచ్చుకోవటం ఏమిటి? మనకు మనమే తయారు చేసుకోలేమా? అంటూ ప్రశ్నించిన కేసీఆర్ తీరు చూస్తే.. మరింత కాలం ఈ సోయి ఏమైందన్న డౌట్ రాక మానదు.

నగరం మొత్తాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చేసి.. పచ్చదనం అన్నది లేకుండా చేయటమే కాదు.. నగర శివారుల్ని సైతం లేఔట్లగా మార్చేసిన గత ప్రభుత్వాల పరంపరను కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. పంటలు పండించే రైతుల్ని.. భూములు అమ్ముకునేలా చేస్తున్న రియల్ బూమ్ కు అడ్డుకట్టటం వేయటం ఏ సర్కారుకు సాధ్యం కాదు. కనీసం పండ్లు.. కూరగాయలు పండించే వారికి రాయితీలు ఇవ్వటం ద్వారా ప్రోత్సాహాన్ని అందించే అంశంపై ఇప్పటికే కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాంటివేమీ చేయని ఆయన ఈ రోజు.. పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు.. పండ్లు.. పూలు.. చివరకు కొత్తిమీర.. మెంతికూర తెచ్చుకోవటం ఏమిటి? సిగ్గుచేటు అని ప్రశ్నించటం చూస్తే.. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేనని.. తామే ఇలాంటి విధానానికి చెక్ పెట్టాలని.. అందుకు తగిన విధానాన్ని రూపొందించాలన్న విషయం అధికారంలోకి వచ్చిన 20 నెలల తర్వాత గుర్తిస్తే.. అది అమలై.. ప్రజలు ఆ దిశగా అడుగులు వేసేసరికి మరెన్ని సంవత్సరాలు పడుతుందో..?