Begin typing your search above and press return to search.

మ‌ర్యాద‌లు ఓకే.. భాష కోసం చేసుడేంది కేసీఆర్‌

By:  Tupaki Desk   |   12 Dec 2017 4:39 AM GMT
మ‌ర్యాద‌లు ఓకే.. భాష కోసం చేసుడేంది కేసీఆర్‌
X
ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హించే రోజులు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేశాయి. మ‌హా అయితే.. మ‌రో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా హాజ‌ర‌య్యేందుకు హైద‌రాబాద్‌ కు వ‌స్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇలాంటి వేళ‌.. అధికారుల‌తో క‌లిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక భేటీ నిర్వ‌హించారు. నాలుగు గంట‌ల పాటు సాగిన ఈ భేటీలో కేసీఆర్ ఫోక‌స్ అంతా దేని మీద ఉంది? అన్న విష‌యం చూసిన‌ప్పుడు ఆశ్చ‌ర్యంతో పాటు ఆవేద‌న క‌ల‌గ‌టం ఖాయం.

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్ని అద్భుతంగా నిర్వ‌హించాల‌ని..ఈ సంద‌ర్భంగా హాజ‌ర‌య్యే ప్ర‌తిఒక్క‌రి మ‌నసుల్ని దోచుకోవాల‌నుకోవ‌టం త‌ప్పేం కాదు. కానీ.. దృష్టి మొత్తం కార్య‌క్ర‌మం ఏర్పాట్లు.. వ‌చ్చే వారికి ఎలాంటి వాహ‌నం ఏర్పాటు చేయాలి.. ఎలాంటి బ‌స ఏర్పాటు చేయాలి.. ఎలాంటి భోజ‌నం పెట్టాల‌ని.. ఎలాంటి మ‌ర్యాద‌లు చేయ‌ల‌న్న దాని మీద‌నే త‌ప్పించి.. తెలుగు భాష వ్యాప్తికి ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలి..? అమ్మ భాష‌కు మ‌రింత ప్రాచుర్యం క‌లిగించేలా కీల‌క నిర్ణ‌యాలు ఏం తీసుకోవాలి? అన్న దానిపై దృష్టి పెట్ట‌టం క‌నిపించ‌టం లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

నాలుగు గంట‌ల పాటు సాగిన కేసీఆర్ రివ్యూను నాలుగే నాలుగు ముక్క‌ల్లో చెప్పాలంటే.. మ‌ర్యాద‌.. మ‌ర్యాద అని మాత్ర‌మే చెప్పాలి. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు తెలంగాణ రాష్ట్ర గౌర‌వానికి సంబంధించిన‌వ‌ని.. ఆహ్వానితుల‌ను నూటికి నూరుశాతం గౌర‌వించాల‌ని.. సౌక‌ర్యాల విష‌యంలో శ‌భాష్ అన్న‌ట్లుగా ఉండాల‌న్న ఆకాంక్ష‌ను కేసీఆర్ వ్య‌క్తం చేశారు.

ఐదు రోజుల పాటు సాగే అమ్మ భాష ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌ర‌గాల‌న్న అభిలాష‌తో పాటు.. ఉత్స‌వాలు జ‌రిగిన‌న్ని రోజులు సాయంత్రం సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా నిర్వ‌హించాల‌న్న ఆదేశాల్ని జారీ చేశారు. ప్రారంభ స‌మావేశాల‌కు ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు.. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ విశిష్ఠ అతిధులుగా వ‌స్తున్నార‌ని చెప్పిన కేసీఆర్‌.. మ‌హాస‌భ‌ల ప్రారంభ ప్ర‌క‌ట‌న ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నోటి నుంచి వ‌చ్చిన వెంట‌నే భారీ ఎత్తున బాణ‌సంచాను కాల్చాల‌ని చెప్పారు. ముగింపు కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య అతిధిగా రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఏయే దేశం నుంచి ఎంత‌మంది అతిధులు వ‌స్తున్న లెక్క‌ల్ని అడిగిన కేసీఆర్‌.. వారంద‌రికి చేస్తున్న ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. విదేశీ అతిధుల‌కు త‌ప్ప‌నిస‌రిగా కార్ల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. విదేశాల నుంచి దాదాపు 8వేల మంది హాజ‌ర‌వుతున్న‌ట్లుగా అధికారులు చెప్పారు. ప్ర‌తి రోజూ తెలంగాణ మీద రూపొందించిన షార్ట్ ఫిలింస్‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని.. సాహిత్య కార్య‌క్ర‌మాలు.. క‌ళాకారుల ప‌రిచ‌యాలు జ‌ర‌గాల‌న్నారు. స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యే ప్ర‌తి ఒక్క‌రితో మాట్లాడి.. వారి అభిలాష క‌నుక్కొని అందుకు అనుగుణంగా ఎవ‌రెవ‌రు ఎక్క‌డికి వెళ‌తారో ఆ విధంగా ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించాల‌న్నారు.

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు అంద‌రూ ఆహ్వానితులే అన్న ప్రాతిప‌దిక‌న స‌భ‌లు నిర్వ‌హించాలి. విదేశీ.. ఇత‌ర రాష్ట్రాల ప్రతినిధులు కూర్చునేందుకు ప్ర‌త్యేక ప్రాంగ‌ణం ఉండాల‌ని.. వివిధ సాహిత్య వేదిక‌ల్లో సాహిత్య కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే వారికి ఒక చోటు.. మంత్రులు.. ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొనే వారికి మ‌రో ప్ర‌త్యేక చోటుతో పాటు మీడియాకు ప్ర‌త్యేక ప్లేస్ ఏర్పాటు చేయాల‌న్న ఆదేశాలు జారీ చేశారు. ఒక పెద్ద కార్య‌క్ర‌మానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయ‌న్న విష‌యం మీద సీఎం రివ్యూ చేయ‌టం త‌ప్పు కాదు. కానీ.. ఏర్పాట్లు.. మ‌ర్యాద‌ల మీద ఎంత స‌మ‌యాన్ని వెచ్చించే కేసీఆర్ లాంటోళ్లు.. తెలుగు భాష‌ను మ‌రింత పాపుల‌ర్ చేయ‌టానికి వీలుగా నిర్మాణాత్మ‌క చ‌ర్య‌లు ప్ర‌భుత్వం ప‌రంగా చేస్తే మ‌రింత బాగుంటుంది క‌దా?