Begin typing your search above and press return to search.

'అమ్మ' కోసం కేసీఆర్ భారీ ఫోక‌స్‌

By:  Tupaki Desk   |   21 Nov 2017 9:45 AM GMT
అమ్మ కోసం కేసీఆర్ భారీ ఫోక‌స్‌
X
చేస్తే భారీగా చేయాలి. న‌లుగురు గుర్తుంచుకునేలా.. అలా గుర్తుండిపోయేలా చేయ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అల‌వాటు. ప‌ట్టించుకోన‌ట్లుగా ఉండే అంశాల విష‌యంలో కేసీఆర్ పోక‌స్ పెడితే.. ఆ కార్య‌క్ర‌మం రూపు రేఖ‌లు ఎంత‌లా మారిపోతాయో తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ప‌వ‌ర్లోకి వ‌చ్చి మూడున్న‌రేళ్లు దాటినా తెలుగు భాష‌కు సంబంధించి కేసీఆర్ పెద్ద‌గా దృష్టి పెట్టింది లేదు. వ‌చ్చే నెల‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నిర్వాహ‌ణ‌ను కేసీఆర్ చేయిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ లాంటి నేత దృష్టి తెలుగు భాష మీద ప‌డిందంటే.. అందులో చోటు చేసుకునే మార్పులు భారీగా ఉండ‌నున్నాయి. నాలుగు కాలాల పాటు తెలుగోళ్లంద‌రికి గుర్తుండిపోయేలా నిర్వ‌హించ‌నున్న ఈ స‌ద‌స్సుకు సంబంధించి సీఎం కేసీఆర్ భారీ రివ్యూను చేప‌ట్టారు.

ముఖ్య అధికారుల‌తో పాటు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన సాహితీ వేత్త‌ల‌తో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారి నుంచి స‌ల‌హాలు.. సూచ‌న‌లు స్వీక‌రించారు. ప్ర‌పంచ‌తెలుగు మ‌హాస‌భ‌ల్ని స‌క్సెస్ చేసేందుకు వీలుగా ఏమేం చేయాల‌న్న అంశంపై ప‌లు సూచ‌న‌లు స్వీక‌రించిన కేసీఆర్‌.. తెలంగాణ ఉద్య‌మంలో అంతా కలిసి స్వ‌రాష్ట్రం కోసం ఎలాప‌ని చేశారో.. తెలుగు మ‌హాస‌భ‌ల‌ను విజ‌య‌వంతం చేయ‌టం కోసం క‌లిసి క‌ట్టుగా ప‌ని చేయాల‌ని కోరారు.

తెలంగాణ ప్రాంతంలో సాహిత్య సృజ‌న జ‌రిగింద‌ని.. ప్ర‌తిభ‌కు కొద‌వ‌లేద‌ని.. కానీ తెలంగాణ వారికి రావాల్సినంత పేరు ప్ర‌ఖ్యాతులు రాలేద‌న్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష మీద జ‌రిగిన కృషి వెలుగులోకి రావాల‌న్న అభిలాష‌ను వ్య‌క్తం చేశారు. తెలంగాణ సాహితీ మూర్తుల ప్ర‌తిభ ప్ర‌పంచానికి చాటి చెప్పేలా.. జ‌న‌రంజ‌కంగా ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లో నిర్వ‌హ‌ణ ఉండాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు కేసీఆర్‌.

తెలుగు భాష కోసం జ‌రిగిన కృషిని ఆవిష్క‌రించేలా స‌భ‌ల్ని నిర్వ‌హించ‌టంతో పాటు.. చ‌రిత్ర‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌న్నారు. ఎవ‌రినో నిందించ‌టానికి కాకుండా.. తెలంగాణ స్వాభిమానాన్ని ఘ‌నంగా చాటేలా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించాల‌ని కోరారు. తెలంగాణ ప్ర‌తిభ‌.. గొప్ప‌త‌నం తాజా స‌భ‌ల‌తో వెలుగులోకి రావాల‌ని.. చిత్ర‌లేఖ‌నంతో పాటు.. ఇత‌ర క‌ళ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరారు.

స‌ద‌స్సు సంద‌ర్భంగా తెలుగు ప‌ద్యాలు.. సాహిత్యం వినిపించాల‌ని.. అముద్రిత గ్రంధాల‌ను ముద్రించాల‌ని.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందించే అతిధ్యం గుర్తుండిపోవాల‌ని కోరారు. దీని కోసం చ‌క్క‌టి విందు.. బ‌స ఏర్పాటు చేయాల‌న్నారు. న‌గ‌రంలో వివిధ వేదిక‌ల్ని సిద్ధం చేసి.. ఒక్కో ప్ర‌క్రియ‌ను ఒక్కో వేదిక‌లో ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. మొత్తంగా ఇంత‌కాలం ప‌ట్టించుకోన‌ట్లుగా క‌నిపించిన అమ్మ భాష మీద కేసీఆర్ పెట్టిన కొంగొత్త ఫోక‌స్ ఎలా ఉంటుందో స‌ద‌స్సు నిర్వ‌హించే తీరుతో అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.