Begin typing your search above and press return to search.

వాత‌లు పెట్టి వెన్న పూసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   10 Dec 2017 4:15 AM GMT
వాత‌లు పెట్టి వెన్న పూసిన కేసీఆర్‌
X
ఏం చేయాల‌న్న వ్యూహం ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడిలో క‌నిపిస్తుంది. కానీ.. ప్ర‌తి మాట‌లోనూ వ్యూహం చాలా కొద్ది మందిలో క‌నిపిస్తుంది. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో.. అందునా తెలుగు రాజ‌కీయాల్లో అలాంటి తీరు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించే వైనం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లో క‌నిపిస్తుంది.

గ‌డిచిన కొద్దిరోజులుగా ఇరిగేష‌న్ ప్రాజెక్టుల్ని ప‌రిశీలించిన కేసీఆర్‌.. తాజాగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు మీద ఒక రివ్యూ పెట్టారు. ఎప్ప‌టిమాదిరే నాన్ స్టాప్ గా ఆరు గంట‌ల పాటు సాగిన ఈ స‌మీక్షా స‌మావేశంలో కేసీఆర్ తీరు ఆస‌క్తిక‌రంగా మారింది.

కాళేశ్వ‌రం ప‌నుల్ని క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన సంద‌ర్భంగా అధికారుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రాజెక్టు ప‌నులు కీల‌క‌మైతే.. అనుకున్న రీతిలో సాగ‌టం లేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు తాగునీటిని అందించే ఉద్దేశంతో చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం గొప్ప‌గా న‌డుస్తోంద‌ని.. మ‌రో నెల‌న్న‌ర‌లో 98శాతం గ్రామాల‌కు తాగునీరు అంద‌నుంద‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌కు అవ‌స‌ర‌మైన నీటిని కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా అందించాల‌ని.. ఆ ప్రాజెక్టును తొంద‌ర‌గా పూర్తి చేసి భ‌గీర‌థ‌కు తాగునీటిని అందించాల‌న్న టార్గెట్ పెట్టేశారు.

ఇదిలా ఉంటే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించిన సంద‌ర్భంగా అక్క‌డి ఇంజ‌నీర్ల‌తో మాట్లాడుతూ.. ప‌నులు అనుకున్నంత వేగంగా సాగ‌టం లేద‌న్న చికాకును ప్ర‌ద‌ర్శించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆరు గంట‌ల రివ్యూ మీటింగ్ లో కాళేశ్వ‌రం ప్రాజెక్టు పనుల విష‌యంలో చేప‌ట్టాల్సిన అంశాల్ని పిన్ పాయింటెడ్ గా అధికారుల‌కు సూచ‌న‌ల రూపంలో అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఇరిగేష‌న్ మంత్రి హ‌రీశ్ ను పొగిడేశారు. ఆయ‌న మీద చాలా ఆశ‌లు పెట్టుకున్న‌ట్లుగా చెప్పారు. ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తార‌ని.. సాగు.. తాగునీటిని అందిస్తార‌ని మంత్రి హ‌రీశ్ పైన‌.. సాగునీటి అధికారుల‌పైనా రాష్ట్ర ప్ర‌జ‌లు కోటి ఆశ‌లు పెట్టుకున్న‌ట్లుగా కేసీఆర్ అభివ‌ర్ణించారు. ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు అనుగుణంగానే మంత్రి హ‌రీశ్‌.. అధికారులు ప‌ని చేస్తున్నారంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్రాజెక్టుల ప‌రిశీల‌న వేళ‌.. ప‌నులు జ‌రుగుతున్న తీరుపై ఫైర్ అయిన కేసీఆర్‌.. తాజాగా మాత్రం సంతృప్తిని వ్య‌క్తం చేయ‌టం చూస్తే.. వాత పెట్టి వెన్న రాసిన‌ట్లుగా అనిపించ‌క మాన‌దు.