Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను క్వ‌శ్చ‌న్ వేస్తే పంచ్ ప‌డిన‌ట్లే!

By:  Tupaki Desk   |   14 Aug 2018 6:16 AM GMT
కేసీఆర్ ను క్వ‌శ్చ‌న్ వేస్తే పంచ్ ప‌డిన‌ట్లే!
X
ఏ స్థాయి నేత అయినా.. విలేక‌రుల స‌మావేశం అన్నంత‌నే కాసింత ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. త‌న స్థాయి ఎలాంటిదైనా.. ప్ర‌శ్నించే గుణంతో పాటు.. త‌మ సూటి ప్ర‌శ్న‌ల‌తో ఇరిటేట్ చేసి.. త‌మ‌ బ్యాలెన్స్ మిస్ అయ్యేలా చేయ‌టంలో పాత్రికేయుల తీరుపై చాలా అప్ర‌మ‌త్తంగా ఉంటారు. అయితే.. ఇలాంటి వాటికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మిన‌హాయింపుగా చెప్పాలి.

మీడియాను అస‌రా చేసుకొని త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని అంత‌కంత‌కూ విస్త‌రించుకుంటూ వ‌చ్చిన కేసీఆర్‌.. ఈ రోజున తెలంగాణ‌లో తిరుగులేని అధినేత‌గా ఆవిర్భ‌వించ‌టం తెలిసిందే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తాను ఎవ‌రి అస‌రాతో అయితే ఈ స్థాయికి వ‌చ్చానో.. అదే మీడియా ప‌ట్ల కేసీఆర్ వ్య‌వ‌హ‌రించే తీరు విచిత్రంగా ఉంటుంది.

త‌న‌కు ఎంతోకాలంగా సుప‌రిచిత‌మైన మీడియా ప్ర‌తినిధుల ప‌ట్ల అట్టే నోరు పారేసుకునే త‌త్త్వం అధినేత‌ల‌కు ఉండేది కాదు. త‌మ స‌ల‌హాలు.. సూచ‌న‌ల్ని ఇచ్చే పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్ల విష‌యంలో రాజ‌కీయ ముఖ్య‌నేత‌లంతా ఒకింత జాగ్ర‌త్త‌గా ఉంటారు. కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నం. త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన మీడియా మిత్రుల‌ను సైతం ఆయ‌న ఉపేక్షించ‌రు.

త‌న‌ను ఇరుకున పెట్టే ప్ర‌శ్న‌ల్ని వేసిన‌ప్పుడు ఆయ‌న రియాక్ష‌న్ కాస్త చిత్రంగా ఉంటుంది. నిన్న‌టి మీడియా స‌మావేశాన్నే తీసుకోండి. కొన్ని క‌ష్ట‌మైన ప్ర‌శ్న‌ల‌కు వ్యంగ్యంగా స‌మాధానాలు ఇచ్చి.. అర్థం చేసుకోవాలి.. ఏది ప‌డితే అది మాట్లాడ‌కూడ‌న్న హెచ్చ‌రిక ధోర‌ణిలో మాట్లాడే కేసీఆర్‌.. అంత‌లోనే.. విలేక‌రిని బ‌ఫూన్ మాదిరి తేల్చేస్తూ.. ఏమ‌య్యా.. ఎంత అమాయ‌కుడివి.. నీకు చెప్పి చేస్తారా ఏంది?.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసే ప‌నే అయితే.. మంత్రివ‌ర్గానికి సైతం తెలీకుండా చేస్తారు తెలుసా? అని చెప్ప‌టం ద్వారా.. అధినేత‌లు ఎంత క‌ఠినంగా ఉంటార‌న్న విష‌యాన్ని చెప్పేశారు. అయితే.. ఇలాంటి మాట‌ల్ని సీరియ‌స్ గా చెబితే జ‌రిగే డ్యామేజ్ కేసీఆర్ తెలవ‌టంతో.. దాన్ని లైట‌ర్ వీన్ లో ఫ‌న్నీ అన్న‌ట్లుగా స‌మాధానం చెప్పారు. ఒక‌వేళ‌.. ప్ర‌జాస్వామ్య వాదులు.. కేసీఆర్ కామెంట్ ను త‌ప్ప ప‌డితే.. ఏందిర భ‌య్ ఈ లొల్లి.. ఏదో స‌ర‌దాగా ముచ్చ‌ట చెబితే అన‌వ‌స‌ర‌మైన లొల్లి చేస్తారే.. సీరియ‌స్ ఇష్యూస్ వ‌దిలేసి.. చిల్ల‌ర విష‌యాల మీద ఫోక‌స్ చేస్తారేంది? అంటూ చిరాకు ప‌డిపోతారు.

నిన్న‌టి మీడియా స‌మావేశాన్నే చూస్తే.. చిరాకు పెట్టే ప్ర‌శ్న‌లు అడిగితే ఇబ్బందే అన్న రీతిలో కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి క‌నిపించింది. దుర‌దృష్ట‌క‌ర‌మైన అంశం ఏమంటే.. గ‌తంలో ఎవ‌రైనా ముఖ్య‌నేత మీడియా ప్ర‌తినిధుల్ని చిన్న‌బుచ్చేలా మాట్లాడితే.. వెంట‌నే త‌మ అభ్యంత‌రాన్ని బ‌లంగా వినిపించే వారు. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. కేసీఆర్ తో పెట్టుకోవ‌టానికి మీడియా అధినేత‌లే ముందు.. వెనుకా ఆలోచిస్తున్న‌ప్పుడు.. ఆ సంస్థ‌ల్లో ప‌ని చేసే ఉద్యోగులైన పాత్రికేయులు మాత్రం ఎందుకు సాహ‌సిస్తారు. ఈ కార‌ణంతోనే.. మ‌న‌సులో ఇరుకున పెట్టే ప్ర‌శ్నలు చాలామంది పాత్రికేయులకు ఉన్నా.. కామ్ గానే ఉన్నారే త‌ప్పించి ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఎందుక‌న్నా.. ప్ర‌శ్నిస్తే పంచ్ ప‌డుతుంది. ప‌రిచ‌యాన్ని కూడా గుర్తు పెట్టుకోడు.. ప్ర‌శ్న‌లు వేసి మాట అనిపించుకునే క‌న్నా.. కామ్ గా ఉండ‌టం బెట‌ర్ అంటూ కొంద‌రు మీడియా మిత్రులు మాట్లాడుకోవ‌టం క‌నిపించింది.