Begin typing your search above and press return to search.

కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం!..ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఊర‌ట‌!

By:  Tupaki Desk   |   24 April 2019 4:31 PM GMT
కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం!..ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఊర‌ట‌!
X
తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల‌కు సంబంధించి రేగిన వివాదం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. వాల్యూయేష‌న్ ఇంట‌ర్ బోర్డు నిర్ల‌క్ష్య ధోర‌ణి ఫ‌లితంగా పాసైన వారు ఫెయిలైతే... ఫెయిల్ అయిన వారు పాసైపోయారు. ప‌రీక్ష‌లు బాగా రాసినా... ఫెయిల్ అయ్యామంటూ ఇప్ప‌టికే 23 మంది విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఇంట‌ర్ బోర్డు తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా పిల్ల‌ల ప్రాణాలు పోతుంటే ప్ర‌భుత్వం గానీ, సీఎం కేసీఆర్ గానీ స్పందించరా? అంటూ ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇంట‌ర్ బోర్డు వ‌ద్ద మొద‌లైన ఆందోళ‌న‌లు తాజాగా సీఎం అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్ కూ తాకాయి. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్‌... ఈ వివాదానికి ముగింపు ప‌లికేలా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు.

వివాదం త‌లెత్తిన వైనం, అందుకు దారి తీసిన కార‌ణాల‌ను ఆయ‌న అధికారుల‌తో స‌మీక్షించారు. అనంత‌రం ఆయ‌న ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇంట‌ర్‌లో ఫెయిల్ అయిన వారి ఆన్స‌ర్ షీట్ల‌ను మ‌రోమారు వాల్యూయేష‌న్ చేయాల‌ని, రీ కౌంటింగ్ కూడా చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందుకోసం విద్యార్థులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని, రీ కౌంటింగ్ తో పాటు రీ వాల్యూయేష‌న్ కూడా ఉచితంగానే నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యం... ఈ ద‌ఫా ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయిన దాదాపు 3 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. ఇక ఇప్ప‌టిదాకా జ‌రిగిన విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్‌... విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ చదువు ఒక్కటే జీవితం కాదని, పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదన్నారు. ప్రాణం చాలా ముఖ్యమైనదని, విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంయమనం పాటించాలని కోరారు.

ఇదిలా ఉంటే... స‌మీక్ష సంద‌ర్భంగా కేసీఆర్‌ అధికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌తో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి అప్పగించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.