Begin typing your search above and press return to search.

‘డ్యామేజ్’ పై కేసీఆర్ ఎంతలా బరస్ట్ అయ్యారంటే

By:  Tupaki Desk   |   25 Sep 2016 5:30 AM GMT
‘డ్యామేజ్’ పై కేసీఆర్ ఎంతలా బరస్ట్ అయ్యారంటే
X
అంతా తాను అనుకున్నట్లే జరిగే తీరుకు అలవాటు పడిన ఒక కీలక నేతకు.. అందుకు భిన్నంగా ఏదైనా జరిగితే? తనకు మించిన శక్తివంతుడు లేడని భావించే వేళ.. నేనున్నానంటూ ప్రకృతి ఎంట్రీ ఇస్తే.. ఎంతటి శక్తివంతుడైనా డమ్మీగా మారాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. భారీ.. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న అధికారుల అంచనాలు ఎలా ఉన్నా.. అవన్నీ వాస్తవ రూపం దాలిస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుంది? నష్టం ఎంత తీవ్రంగా ఉంటుంది? ప్రభుత్వానికి ఎంత చెడ్డపేరు వస్తుందన్న విషయాలు అనుభవంలోకి రావటం ఎంత ఇబ్బందన్న విషయం కేసీఆర్ కు అర్థమైంది.

భారీగా కురుస్తున్న వర్షాలతో కోటి మందికి పైగా ఉన్న హైదరాబాదీయులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్న వేళ.. ఢిల్లీలో ఉండిపోయిన కేసీఆర్.. పరిస్థితిని గుర్తించి హడావుడిగా హైదరాబాద్ కు వచ్చేసి.. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. భారీగా కురిసిన వర్షాల కారణంగా ప్రజల ఇబ్బందుల మాట ఎలా ఉన్నా.. ప్రభుత్వానికి చెడ్డపేరు రావటం.. ప్రభుత్వానికి ఉన్న ఇమేజ్ తీవ్రంగా డ్యామేజ్ కావాటాన్ని భరించలేని ఆయన బరస్ట్ అయినట్లుగా కనిపిస్తోంది.

అతి భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు.. ఇందులో ప్రభుత్వ పాత్రపై వివరణ ఇచ్చే ప్రయత్నంలో వాన మీద.. అధికారుల మీదా.. ప్రజల మీదా.. మీడియా.. సోషల్ మీడియా మీదా ఆయన తన అక్కసును వెళ్లగక్కటం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాల మీద సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. హైదరాబాద్ వర్ష బీభత్సం గురించే ఎక్కువ మాట్లాడారని చెప్పాలి. హైదరాబాద్ లో చోటు చేసుకున్న పరిణామాలన్నీ నాలాలపై అక్రమ కట్టడాల వల్లేనని తేల్చేసిన ఆయన.. వర్షాకాలం పూర్తి అయిన వెంటనే 28 వేల అక్రమ కట్టడాల్ని కూల్చేస్తామని.. ఆ కూల్చే ఆస్తుల్లో తమ పార్టీకి చెందిన వారివి ఉన్నా పట్టించుకోమని.. ఈ విషయంలో అడ్డు వచ్చే రాజకీయ పార్టీలను ఢీ కొంటామని వ్యాఖ్యానించారు.

ఇటీవల కురిసిన వర్షాలతో రానున్న రెండేళ్ల వరకూ కరవు మాటే వినిపించదని వ్యాఖ్యానించారు. సెప్టెంబరు మాసంలో హైదరాబాద్ లో కురిసే సాధారణ వర్షపాతం8.4 సెంటీమీటర్లు అని.. 1908 తర్వాత ఈ ఏడాది అది కాస్తా 46.2 సెంటీమీటర్ల వర్షం కురిసిందని లెక్క చెప్పిన కేసీఆర్.. సాధారణ వర్షపాతం కంటే 448 శాతం ఎక్కువగా కురిసిన వానలతో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు గురైనట్లుగా చెప్పారు. మంత్రులు.. అధికారులు నగరంలో పర్యటించి సమస్యల్ని పరిష్కరిస్తున్నా.. మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందని.. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందని మండిపడ్డారు.

‘‘తప్పుడు ప్రచారాలు వద్దు. వర్షాలు పడినప్పుడు సహజంగా కొన్ని సమస్యలు వస్తాయి. అత్యవసరంగా రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ ను ఖాళీ చేయిస్తున్నాం. హైదరాబాద్ లో రెండు కాలనీల ప్రజల్ని ఖాళీ చేయించాం. వరంగల్ లో మూడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించటం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లైయింగ్ స్వ్కాడ్ ను నియమిస్తాం. వీరికి పోలీసులు సాయంగా ఉంటారు. నిర్దాక్షిణ్యంగా ఆక్రమ కట్టడాలను కూల్చేస్తాం. ఆస్తులను చెడగొట్టుకోవద్దని ప్రజలకు సూచిస్తున్నా. నాలాలపై ఆక్రమ కట్టడాలు కూల్చివేసేటప్పుడు పాజిటివ్ రిపోర్ట్ చేయాలి’’ అని రానున్న రోజుల్లో ఏం చేస్తామన్న విషయాన్ని ఆయ‌న‌ చెప్పుకొచ్చారు.

ఆక్రమ కట్టడాల తొలగింపులో పేదలు.. మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని.. అక్రమ కట్టడాల సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల బహుమానం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భవన నిర్మాణాలు.. ఆక్రమాల విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కేసీఆర్.. విపక్షాల మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్.. టీడీపీ నిర్వాకంలోనే నగరం 60 ఏళ్లు ఉందని.. అక్రమ నిర్మాణాలకు అనుమతిని ఇచ్చింది ఈ దొరలేనన్న ఆయన.. ప్రతిపక్షానికి చిత్తశుద్ధి ఉంటే అక్రమ కట్టడాలు కూల్చేటప్పుడు అడ్డుకోవద్దన్నారు. హైదరాబాద్ కు జబ్బు చేసిందని.. మందుగోళి వేయటం కానీ తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సిందేనని తేల్చేశారు.