Begin typing your search above and press return to search.

మోడీతో గంట భేటీలో కేసీఆర్ ఏం కోరారంటే..?

By:  Tupaki Desk   |   16 Jun 2018 3:30 AM GMT
మోడీతో గంట భేటీలో కేసీఆర్ ఏం కోరారంటే..?
X
ఒక ముఖ్య‌మంత్రి ప్ర‌ధాని అపాయింట్ మెంట్ కోర‌టం.. అనంత‌రం ఢిల్లీకి వెళ్ల‌టం రోటీన్ గా జ‌రిగేదే. ఢిల్లీకి వెళ్లిన ముఖ్య‌మంత్రికి.. ప్ర‌ధానికి టైం లేదు.. మీకు అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేదంటూ స‌మాధానం రావ‌టం మాత్రం రోటీన్‌కు భిన్న‌మే. అందులోకి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ స్థాయిలో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల్ని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయాల‌ని త‌పిస్తున్న బ‌ల‌మైన సీఎంకు ప్ర‌ధాని మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోవటం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి ప్ర‌ధాని అపాయింట్ కోసం సీఎం ప్ర‌య‌త్నించ‌టం..ఈసారి స‌క్సెస్ ఫుల్ గా భేటీ కావ‌టం జ‌రిగింది. ఇదంతా ఎవ‌రి గురించి చెబుతున్నామో ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది.

అవును.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. త‌న‌ను క‌ల‌వ‌టానికి ప్ర‌య‌త్నించే విప‌క్ష నేత‌ల‌కు కేసీఆర్ అపాయింట్ మెంట్ దొర‌క‌ని వైనం తెలిసిందే. అలాంటి అనుభ‌వ‌మే ప్ర‌ధాని మోడీ పుణ్య‌మా అని కేసీఆర్ కు ఎదురై.. అదెలా ఉంటుందో తెలిసి వ‌చ్చి ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు.

తాజా భేటీ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీతో కేసీఆర్ ఏం మాట్లాడి ఉంటారు? దాదాపు గంట పాటు సాగిన వీరి భేటీకి సంబంధించి అస‌లు విష‌యాల బ‌య‌ట‌కు రాలేదు. స‌హజంగా పెద్ద‌ల్ని.. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారిని క‌లిసిన‌ప్పుడు.. త‌మ‌కేం కావాలో కోరుతూ కోర్కెల చిట్టాను ఇవ్వ‌టం.. వారు ఆ విన‌తిప‌త్రాన్ని చూసి.. త‌ప్ప‌కుండా ప‌రిశీలిస్తామన్న మాటను చెబుతుంటారు. తాజా ఎపిసోడ్‌లోనూ అదే జ‌రిగింది.

మోడీని క‌లిసిన కేసీఆర్‌.. ఆయ‌న‌కు భారీ విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. ప‌ది అంశాల‌తో కూడిన కోర్కెల చిట్టాను ఆయ‌న ముందు ఉంచారు. త‌మ విన‌తుల విష‌యాన్ని సీరియ‌స్ గా ప‌రిశీలించాల‌ని ప్ర‌ధానిని సీఎం కేసీఆర్ కోరిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంత‌కూ ప్ర‌ధాన‌మంత్రికి సీఎం కేసీఆర్ ఇచ్చిన విన‌తిప‌త్రంలోని ఆ 10 అంశాలు ఏమిట‌న్న‌ది చూస్తే..

1) కాళేశ్వరానికి 20 వేల కోట్లివ్వండి.
2) హైకోర్టు విభజనపై త్వరగా తేల్చండి.
3) కొత్త జోన్లకు ఆమోదం ఇప్పించండి.
4) రైల్వే ప్రాజెక్టులు వేగవంతం చేయండి.
5) బైసన్‌పోలో భూమిని మాకు అప్పగించండి.
6) వెనుకబాటు నిధులు విడుదల చేయండి.
7) రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయండి.
8) కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ పెట్టండి.
9) హామీ మేరకు ఐటీఐఆర్‌కు నిధులివ్వండి.
10) 21 కొత్త నవోదయ స్కూళ్లు పెట్టండి.

మొత్తం ప‌ది విన‌తుల్లో ముఖ్య‌మైన‌ది.. కీల‌క‌మైన‌ది కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.80వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 20 జిల్లాల్లో 18 ల‌క్ష‌ల ఎక‌రాల కొత్త ఆయుక‌ట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తామ‌ని.. బ‌డ్జెట్ లో ఈ ప్రాజెక్టు కోసం రూ.25వేల కోట్లు కేటాయించామ‌ని..మ‌రో రూ.22వేల కోట్లు అప్పు తెచ్చిన‌ట్లుగా ప్ర‌ధాని మోడీ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తికి మ‌రిన్ని నిధులు అవ‌స‌ర‌మైన వేళ‌.. ప్రాజెక్టు ప్రాధాన్య‌త‌ను దృష్టిలో పెట్టుకొని అయినా రూ.20వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాల్సిందిగా కేసీఆర్ కోరారు. దీనికి.. ప్ర‌ధాని మోడీ సానుకూలంగా స్పందించిన‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌ధాని మోడీ దృష్టికి తీసుకెళ్లిన ప‌ది అంశాలే కీల‌క‌మే అయినా.. కాళేశ్వ‌రానికి రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం కీల‌క‌మైన‌దిగా చెబుతున్నారు. మ‌రి..కేసీఆర్ తాజా విన‌తికి ప్ర‌ధాని మోడీ ఎలా రియాక్ట్ అయ్యార‌న్న‌ది కాల‌మే స‌మాధానం చెప్పాలి.