Begin typing your search above and press return to search.

తెలంగాణ కొత్త డిమాండ్‌...

By:  Tupaki Desk   |   2 Sep 2015 6:31 AM GMT
తెలంగాణ కొత్త డిమాండ్‌...
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్రత్యేక ప్యాకేజీ అంశం తెరమీదకు రావడంతో.. తెలంగాణ సర్కార్ కూడా కేంద్రాన్ని ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. వెనకబడ్డ తెలంగాణకు భారీగా ఆర్థిక సహయం చేయాలని కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తోంది. ఇప్పటికే.. సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్థిక‌ మంత్రి అరుణ్‌ జైట్లీ, ప్రధాని న‌రేంద్ర మోడీకి లేఖలు రాసారు. తెలంగాణలో నెలకొన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులను లేఖలో సవివరంగా పేర్కొన్నారు. తెలంగాణ వెనక బడ్డ రాష్ట్రమని స్వయంగా ప్లానింగ్ కమిషన్, ఆర్థిక‌ కమిషన్ చెప్పిన విషయాలను లేఖలో గుర్తుచేసారు. విద్య, వైద్యం, విద్యుత్ వసతుల కల్పన, వ్యవసాయం, సాగు, త్రాగు నీటి వనరులు, వర్షాభావం, కరువు, వ్యక్తిగత ఆదాయం తదితర అంశాల్లో వెనకబాటుతనాన్ని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని ఆయా రంగాల్లో ప్రగతి సాధించేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌లకు ఆర్ధిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు సహాయం చేయడంతో పాటు..45వేల చెరువుల పునరుద్దరణకు కేంద్రం వాటాగా 10,216 కోట్లను అందించాలన్నారు. దాంతోపాటు.. వాటర్ గ్రిడ్ కోసం 20,355 కోట్లను అందించాలని ప్రతిపాదనలు పంపారు. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి వచ్చే 5 ఏళ్లలో 30,571 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది.

మ‌రోవైపు అప్పుల పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరుతోంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం రాష్ట్రాలు తమ జాతీయ స్థూల ఉత్పత్తి- జీఎస్‌డీపీలో కేవలం 3 శాతం మాత్రమే అప్పులు తీసుకోవచ్చు. దీన్ని 3.5 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్. రెవెన్యులో 10 శాతంలోపే వడ్డీల రూపంలో చెల్లిస్తున్నందున..అప్పుల పరిమితిని పెంచుకునేలా తెలంగాణకు వెసులుబాటు కల్పించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియాకు మరోసారి లేఖలు రాసారు సీఎం కేసీఆర్.

మొత్తానికి ఓ వైపు అప్పుల పరిమితిని పెంచుకోవడంతో పాటు..కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీని రాబట్టడం ద్వారా భారీగా నిధులను సమీకరించాలని తెలంగాణ సర్కార్‌ భావిస్తోంది. తద్వారా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రీమ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విజ్ఞప్తులకు కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.