Begin typing your search above and press return to search.

మోడీకి బాబు కంటే పెద్ద లిస్ట్ ఇచ్చిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   12 Feb 2016 11:54 AM GMT
మోడీకి బాబు కంటే పెద్ద లిస్ట్ ఇచ్చిన కేసీఆర్‌
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుదీర్ఘ కాలం త‌ర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్ర అంశాల‌ను చ‌ర్చించేందుకు స‌మావేశ‌మ‌య్యారు. దాదాపు 40 నిమిషాల పాటు మోడీతో భేటీ అయిన కేసీఆర్ ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌కు చెందిన ప‌లు అంశాల‌పై త‌న జాబితా విప్పారు. కొద్దికాలం క్రితం ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌ధానిని క‌లిసిన స‌మ‌యంలో ఇచ్చిన జాబితా కంటే కేసీఆర్‌ మ‌రిన్ని అంశాలు ఎక్కువ‌గా ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తిక‌రం.

రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన‌ హామీలను నెరవేర్చాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. ప్రాణహిత-చేవెళ్ల బ‌దులుగా నిర్మించ‌నున్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ రాష్ర్టానికి గ‌తంలో మంజూరు చేసిన ఐటీఐఆర్‌ కు నిధులు కేటాయించాలని, ఎఫ్‌ ఆర్‌ బీఎం పరిమితిని పెంచాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో ఏర్పాటు చేయ‌నున్న గిరిజ‌న యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తించాలని ప్ర‌ధాన‌మంత్రిని సీఎం కేసీఆర్ కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన మిషన్ భగీరథకు రూ. 10 వేల కోట్లు ఆర్థిక సాయం అంద‌జేయాల‌ని విన్న‌వించారు. తెలంగాణ‌లో ఏర్పాటుచేయ‌నున్న ఎయిమ్స్‌ కు వచ్చే బడ్జెట్‌ లో నిధులు కేటాయించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌ లో ఉన్న ఉమ్మడి హైకోర్టు స‌మ‌స్య‌ను ప‌రిష్కరించాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి విన్న‌వించారు. హైకోర్టును విభజించి ప్ర‌స్తుత ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని తెలంగాణ‌కు కేటాయిస్తూ ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరారు. దీంతోపాటు తెలంగాణ కోసం వచ్చే నాలుగేళ్ల కోసం రూ. 30,571 కోట్లు ప్రత్యేక గ్రాంట్‌ ను కోరారు.