Begin typing your search above and press return to search.

స్టైల్ మార్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   28 Aug 2015 10:56 AM GMT
స్టైల్ మార్చిన కేసీఆర్
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేనిని పట్టుకున్నా ఎదురు తిరుగుతోంది. ఏ ప్రకటన చేసినా.. ఆ తర్వాత దానిని నిలుపు చేయక తప్పడం లేదు. అందుకే ఆయన తన స్టైల్ మార్చారు. ఈసారి నేరుగా ప్రకటనలు చేయకుండా కమిటీలు వేయడాన్ని మొదలు పెట్టారు.

సచివాలయం తరలింపు అయినా, ఉస్మానియా భూముల స్వాధీనం అయినా.. ఉస్మానియా ఆస్పత్రి ఖాళీ చేయడం అయినా కేసీఆర్ ఏకపక్షంగా ప్రకటించారు. దాంతో అవేవీ ముందుకు కదలడం లేదు. దాంతో హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ, కూల్చివేతలపై ఆయన వ్యూహాత్మకంగా స్పందించారు. దానిపై తలసాని నేతృత్వంలో కమిటీ వేశారు. దీని వెనకకూడా ఒక కారణం ఉంది. క్రమబద్ధీకరణకు హైకోర్టు ససేమిరా అంగీకరించదు. ఎందుకంటే, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై వైఎస్ హయాంలోనే కోర్టు తప్పుబట్టింది. ఆ తర్వాత మరోసారి క్రమబద్ధీకరణ చేస్తే అంగీకరించేది లేదని, ఈ ఒక్కసారికీ అంటూ అనుమతి ఇచ్చింది. ఇక కూల్చవేతలు మొదలు పెడితే హైదరాబాద్ వ్యాప్తంగా గగ్గోలు మొదలువుతుంది. సీమాంధ్రులు అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారని కేసీఆర్ చెబుతున్నా.. ఆ పాపంలో తెలంగాణ ప్రజలూ ఎక్కువగానే ఉంటారు. మొత్తం అందరి ఇళ్లను కూల్చివేయాలంటే హైదరాబాద్ లో సగం కూల్చవేయాల్సిందే. ఇది కేసీఆర్ ప్రభుత్వానికే ఎసరు తెచ్చే ప్రమాదం ఉంది.

అయితే, కూల్చివేతలతో ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. క్రమబద్ధీకరణ చేస్తే వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఆదాయం కోసం క్రమబద్ధీకరణకు వెళితే కోర్టు నుంచి అక్షింతలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కేసీఆర్ కమిటీ ఎత్తుగడ వేశారు. ఆ కమిటీ సిఫారసు చేసింది కనక క్రమబద్ధీకరణ చేశామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొత్తంమీద కేసీఆర్ సర్కారు కూల్చివేతల కంటే క్రమబద్ధీకరణకే ఎక్కవు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.