Begin typing your search above and press return to search.

గవర్నర్ ఘోషతో.. కేసీఆర్ లో కదలిక?

By:  Tupaki Desk   |   19 March 2017 5:30 AM GMT
గవర్నర్ ఘోషతో.. కేసీఆర్ లో కదలిక?
X
రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ కొన్ని అంశాల మీద తనకున్న అభిప్రాయాన్ని విస్పష్టంగా బయటకు చెప్పేయటమే కాదు.. ప్రభుత్వాల తీరును కూడా తప్పు పడుతుంటారు. కొన్ని కార్యక్రమాలకు హాజరై.. ప్రసంగించే సందర్భంలో ఆయన నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు ఆసక్తికరంగా ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య.. వైద్యానికి సంబంధించిన పరిస్థితులపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటమే కాదు.. ఇప్పుడున్న పరిస్థితులు మారాలంటూ పలు సందర్భాల్లో తన ఆవేదనను వ్యక్తం చేయటం కనిపిస్తుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. గవర్నర్ నరసింహన్ తో సన్నిహితంగా ఉన్నా.. ఆయన ఎత్తి చూపిన తప్పుల విషయంలో వెంటనే రియాక్ట్ అయినట్లుగా కనిపించదు. ప్రైవేటు ఆసుపత్రుల దోపీడీపై ఇప్పటికే పలు మార్లు తన ఆవేదనను వ్యక్తం చేసినప్పటికీ ఇద్దరు చంద్రుళ్ల నుంచి స్పందన కనిపించలేదనే చెప్పాలి.

ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులుగా.. ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసే.. విద్య.. వైద్యంపై స్పందించి.. ప్రైవేటు దోపిడీకి చెక్ పెట్టాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా వ్యవహరించటం.. గవర్నర్ లాంటి వ్యక్తి నోటి నుంచి వచ్చినా.. పరిస్థితుల్లో మార్పులు రాకపోవటంపై పలువురు విమర్శిస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకే తరహా వైద్యానికి వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేయటంపై ఆయన పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేయటం కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద గవర్నర్ మాటలు పని చేసినట్లుగా కనిపిస్తోంది.

ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుకు చెక్ చెప్పేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణను సిద్ధం చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చేలా..వారి కార్యకలాపాల్ని నిత్యం సమీక్షించేలా ఒక విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరిగే ప్రతి చికిత్సను ఇకపై ప్రభుత్వానికి తెలియజేయటమే కాదు.. రోజువారీ కార్యకలాపాల్ని ఆన్ లైన్లో బహిరంగం ఉంచాల్సి ఉంటుంది. ఇలా వెల్లడించిన సమాచారంపై ప్రతి నెలా ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తుంది.

ఒకవేళ.. ఈ ఆడిట్ సందర్భంగా ఏదైనా లోపాలు జరిగినట్లుగా గుర్తిస్తే..సదరు డాక్టర్ తో పాటు..ఆ డాక్టర్ పని చేస్తున్న ఆసుపత్రిపైనా చర్యలు తీసుకుంటారు. ఈ మార్పులకు సంబంధించిన విధివిధానాల్ని సిద్ధం చేస్తున్నారు. కేంద్ర స్థాయిలోని క్లినికల్ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ను తెలంగాణ రాష్ట్రానికి వర్తింపచేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టి.. దాన్ని ఆమోదించి.. ఈ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలా చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఔట్ పేషెంట్లు 80 శాతం.. ఇన్ పేషెంట్ సేవలు 70 శాతం ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారానే జరుగుతున్న విషయాన్నిమర్చిపోకూడదు. ఇంత భారీగా జరుగుతున్న వైద్య సేవల తీరుపై ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోవటంతో.. ఎవరికి వారు వారికి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహిస్తున్నారు. ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ జారీకి సంబంధించిన అంశంలో తప్పించి.. మిగిలిన అంశాలేమీ ప్రభుత్వ నియంత్రణలో లేకపోవటంతో.. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. దోపిడీకి పాల్పడుతున్నాయి. ఆ తీరుకు చెక్ పెట్టటమే కాదు.. అన్ని కార్పొరేట్ ఆసుపత్రులపైనా ప్రభుత్వ నియంత్రణ ఉండేలా పడుతున్న అడుగుల్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర సర్కారుతీసుకుంటున్న చర్యల్ని ఏపీ ప్రభుత్వం అనుసరించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ప్రైవేటు.. కార్పొరేట్ విద్య మీదా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/