ఎన్నికల వేళ.. మరో ఉచితానికి కేసీఆర్ స్కెచ్

Thu Jul 12 2018 11:15:30 GMT+0530 (IST)

వరాల దేవుడిగా పేరున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరో సంచలనానికి తెర తీయనున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. షెడ్యూల్ కంటే ముందే ముందస్తు ఎన్నికలు జరగటానికి ఓపక్క ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చేసినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓట్లను భారీగా కొల్లగొట్టే వ్యూహాల్ని కేసీఆర్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.దేశంలో మరెక్కడా లేని విధంగా భారీ ఎత్తున నిధులతో రైతుబంధు పథకాన్ని యుద్దప్రాతిపదికన అమలు చేసిన కేసీఆర్ సర్కారు.. తాజాగా మరో తాయిలానికి రెఢీ అవుతోంది. రైతుల మనసుల్ని టోకుగా దోచుకోవటానికి వీలుగా వేసిన రైతుబంధు పథకానికి కొనసాగింపుగా తాజా తాయిలాన్ని త్వరలో ప్రకటించాలన్న ఆలోచనలో ఉంది.

వ్యవసాయం చేసే రైతుకు అండగా ఉండేందుకు ఎంతటి కష్టానికైనా తాము సిద్ధమన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి.. వ్యవసాయానికి అవసరమైన యూరియాను ఉచితంగా ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. వ్యవసాయానికి కీలకమైన పెట్టుబడి సాయాన్ని ఇప్పటికే అందించిన కేసీఆర్.. సాగుకు కీలకమైన యూరియాను సైతం ఉచితంగా అందజేస్తే.. అందుకు తగ్గ ఫలితం భారీగా లభిస్తోందన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒకవైపు రైతుబంధు.. మరోవైపు రైతు జీవిత బీమాతో కడుపు నింపిన కేసీఆర్.. ఉచితంగా యూరియా ఇస్తామన్న హామీతో అన్నదాతల్ని ఫుల్ ఖుషీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పంటకైనా.. అదే కాలమైనా యూరియా వినియోగం రైతుకు తప్పనిసరి. దాని కోసం డబ్బులు ఖర్చు చేసే రైతుకు ఆ భారం లేకుండా చేసి.. యూరియా బస్తాల్ని ఉచితంగా అందిస్తే.. రైతాంగం.. దానికి అనుబంధ విభాగాలు తమకు సానుకూలంగా మారతాయన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ పథకాన్ని ప్రకటించటానికి ముందు.. అసలీ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది?  రైతులు ఎంత యూరియాను ఖర్చు చేస్తున్నారు?  ఉచితంగా ఇచ్చే వరాన్ని ప్రకటిస్తే.. దాన్ని ఎలా పంపిణీ చేయాలి?  అంత భారీగా యూరియా కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలన్న మాటను కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు ఉచిత యూరియాను అందించే ప్రకటన చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక.. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఉచిత యూరియాను పంపిణీ చేయాల్సి వస్తే.. రూ.500 కోట్లు ఖర్చు అవుతుందన్న లెక్కను ప్రాథమికంగా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై జోరుగా చర్చ నడుస్తుందని చెబుతున్నారు. కేసీఆర్ సర్కారుకు భారీ మైలేజీ ఇచ్చే అవకాశం ఉన్న ఉచిత యూరియా పథకానికి రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు అన్న ప్రాథమిక లెక్కల నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రకటించటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

వేలాది కోట్ల రూపాయిలు వివిధ పథకాలకు ఖర్చు పెడుతున్నా.. వేటికి రానంత భారీ మైలేజీ ఉచిత యూరియా పథకానికి వచ్చే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే.. ఎన్నికల వేళ సీన్ మొత్తంగా మారే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.