కేసీఆర్ చెప్పిన దేశం అప్పుల లెక్క

Tue Mar 20 2018 16:36:57 GMT+0530 (IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల లెక్కలను తనదైన శైలిలో ఆసక్తికరంగా వివరించారు. శాసనసభలో బడ్జెట్ పై చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇస్తుండగా...బీజేపీ సభ్యులు జోక్యం చేసుకొని తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. దీంతో కేసీఆర్ జోక్యం చేసుకొని బీజేపీ తీరుపై మండిపడ్డారు. `బీజేపీ సభ్యులు అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 21 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. అప్పులు చేయడం లేదా? అప్పులు చేయకుండానే ఆ రాష్ర్టాలు పరిపాలనను కొనసాగిస్తున్నాయా?` అని ప్రశ్నించారు.రాష్ట్ర అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేయడం తప్పు కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ` మా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాం. అప్పులు తీసుకోవడం బడ్జెట్‌లో భాగం. అభివృద్ధి చెందుతున్న అమెరికా - జపాన్ దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి. దేశం అప్పులు రూ. 82 లక్షల కోట్లు. దేశ జీడీపీ రూ.167 లక్షల కోట్లు ఉంది. అందులో 49.5 శాతం మేర కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది` అని సీఎం తెలిపారు. ఈ ఏడాది కేంద్రం చెల్లిస్తున్న అప్పులు రూ. 8.76 లక్షల కోట్లు` అని వెల్లడించారు. అప్పులు తీసుకోవడం బుద్ధి తక్కువ ఆలోచన కాదని అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ జీఎస్ డీపీలో 21 శాతం అప్పులు ఉన్నాయని తెలిపారు. `ఉదయం పథకం కింద రూ. 9 కోట్ల అప్పు వచ్చింది. ఈ నాలుగు సంవత్సరాల్లో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చేయలేదా?` అని ప్రశ్నించారు.

సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి - ఆసరా పెన్షన్లు - గురుకుల పాఠశాలల ఏర్పాటు - కల్యాణలక్ష్మీ - షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అని సీఎం కేసీఆర్ అడిగారు. `మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తుంది. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడటం బాధాకరం. ప్రతి ఒక్కరూ సభా సంప్రదాయాలను కాపాడాలి`అని సీఎం సభ్యులను కోరారు.