Begin typing your search above and press return to search.

కేసీఆర్ బ్రీఫింగ్..జగన్ తో చెలిమి - మోదీతో చెడుగుడు

By:  Tupaki Desk   |   18 Jun 2019 4:34 PM GMT
కేసీఆర్ బ్రీఫింగ్..జగన్ తో చెలిమి - మోదీతో చెడుగుడు
X
టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన భవిష్యత్తు వ్యూహాలేమిటో చెప్పేశారు. నేటి మధ్యాహ్నం తన కేబినెట్ మిత్రులతో అయిన కేసీఆర్ సుధీర్ఘంగానే చర్చలు జరిపారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించేందుకు స్వయంగా వచ్చిన కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు కొనసాగించేందుకు సిద్ధంగా లేమని చెప్పిన కేసీఆర్... ఏపీతో ఇకపై ఉల్లాసభరిత వాతావరణంలో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ మేరకు కేటినెట్ లో నిర్ణయం తీసుకున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇది తెలుగు ప్రజలకు శుభవార్తగా భావిస్తున్నట్టు కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవనాలను తెలంగాణకు అప్పగించడం ద్వారా ఏపీ ప్రభుత్వం స్నేహ హస్తం చాచిందని - దాన్ని తాము కొనసాగించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. గతంలో పొరుగు రాష్ట్రాలతో అనేక వివాదాలు ఉండేవని - ప్రతి రోజూ బస్తీ మే సవాల్ అన్నట్టుగా ఉండేదని - ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆ పరిస్థితి మారిందని తెలిపారు. కర్ణాటకతో సమస్యలు సమసిపోయాయని - ఇటీవల మూడుసార్లు పరస్పరం నీళ్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందని కేసీఆర్ వివరించారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించిన కేసీఆర్... యువకుడు - ఉత్సాహవంతుడు అయిన జగన్ ఏపీలో సీఎం అయ్యారని - ఆయన తన రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నీటిని అందించాలని దృఢంగా నిర్ణయించుకున్నారని తెలిపారు. ముఖ్యంగా - ఉత్తరాంధ్ర - రాయలసీమ - కోస్తా ప్రాంతాల్లోని మెట్టభూములకు నీళ్లు తీసుకెళ్లాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారని వివరించారు. తెలంగాణలో కాళేశ్వరం ఎలా పూర్తయిందో - ఏపీలో కూడా అలాగే కొన్ని ప్రాజక్టులు పూర్తిచేసుకోవాలని జగన్ చెప్పారని - భేషజాలు పనికిరావన్న అభిప్రాయం జగన్ వైఖరి ద్వారా అర్థమవుతోందని కేసీఆర్ అన్నారు. ఈ నెల 27 - 28 తేదీల్లో ఏపీ నీటిపారుదల మంత్రిత్వ శాఖ నుంచి ఓ బృందం హైదరాబాద్ వస్తోందని - తాము కూడా విజయవాడ వెళ్లి జలాల విషయంలో చర్చలు జరుపుతామని వెల్లడించారు. అవసరమైతే పరిశీలన బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి నివేదికలు రూపొందిస్తాయని తెలిపారు. కృష్ణా - గోదావరికి సంబంధించి 4800 టీఎంసీల నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు పుష్కలంగా వాడుకోవడానికి అవకాశం ఉందని - ఇకమీదట తెలుగు రాష్ట్రాల వివాదాల్లో కేంద్రం జోక్యం చేసుకునే దుర్గతి పట్టకూడదని తానూ - ఏపీ సీఎం జగన్ నిశ్చయించుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. గతంలో అపార్థాలు - కయ్యాలు - కీచులాటల ద్వారా అంతిమంగా తెలుగు ప్రజలు నష్టపోయారని తెలిపారు. ఇకమీదట ఆ సమస్య ఉండబోదని - అందుబాటులో ఉన్న సుమారు ఐదువేల టీఎంసీల నీళ్లు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికి తీసుకెళ్లాలన్నది తమ ప్రణాళిక అని స్పష్టం చేశారు. రాబోయే రెండు మూడేళ్లలో దాని ఫలితాలు కనిపిస్తాయని చెప్పారు.

ఏపీతో స్నేహాన్నే కొనసాగిస్తామని చెప్పిన కేసీఆర్... కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో మాత్రం కయ్యానికే కాలు దువ్వినట్టుగా వ్యవహరించారు. కేంద్రంలోని మోదీ సర్కారుతో ఆయా సందర్భాలు, సమయానుకూలంగా వ్యవహరిస్తామని - ఆమోదయోగ్యమైన - ప్రజోపయోగమైన అంశాలపై మోదీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటే హర్షిస్తామని - అదే సమయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మోదీ సర్కారును వ్యతిరేకిస్తామని కూడా కేసీఆర్ క్లారిటీగానే చెప్పేశారు. అయినా కాళేశ్వరానికి మోదీని ఎందుకు పిలవలేదన్న ప్రశ్న ఎదురైన సందర్భంగా కేసీఆర్ ఓ రేంజిలో ఫైరైపోయారు. ప్రతి కార్యక్రమానికి మోదీని పిలవాలా? అన్ని ప్రశ్నించిన కేసీఆర్... మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి మోదీని పిలిచాం కదా అని గుర్తు చేశారు. కాళేశ్వరం సాధకుడిని తానేనని చెప్పుకున్న కేసీఆర్... ఈ ప్రాజెక్టుకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని సంచలన వ్యాఖ్య చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కూడా ఆయన చెప్పారు. మొత్తంగా మోదీ సర్కారుతో కేసీఆర్ చెలిమి లేదనే చెప్పేశారన్న వాదన వినిపిస్తోంది. అయినా తాను ఢిల్లీకి వెళితే ఓ స్టోరీ - వెళ్లకుంటే మరో స్టోరీ... ఇదంతా సిల్లీ వ్యక్తులు చేసే పని అంటూ తనపై వ్యతిరేక కథనాలు రాస్తున్న మీడియాపైనా కేసీఆర్ నిప్పులు చెరిగారు.