Begin typing your search above and press return to search.

విజ‌య‌వాడ‌లో అవ‌న్నీ బ‌య‌ట‌పెడ‌తా - గులాబీ ద‌ళ‌ప‌తి

By:  Tupaki Desk   |   11 Dec 2018 1:07 PM GMT
విజ‌య‌వాడ‌లో అవ‌న్నీ బ‌య‌ట‌పెడ‌తా -  గులాబీ ద‌ళ‌ప‌తి
X
తెలంగాణలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘ‌న విజయం సాధించిన నేప‌థ్యంలో గులాబీ ద‌ళ‌ప‌తి - అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ భవన్‌ లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``ఈ రోజు ఎన్నికల్లో టీఆర్‌ ఎస్ పార్టీకి లభించిన ఘనవిజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం. రైతులు - మహిళలు - నిరుపేద ప్రజలు - వెనుకబడిన వర్గాల ప్రజలు - దళితులు - గిరిజనులు - మైనార్టీలు కులాలకు అతీతంగా నిండుగా దీవించి ఇచ్చిన విజయం. విజయానికి కారకులైన వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. టీఆర్‌ ఎస్ పార్టీ నాయకులు - కార్యకర్తలు అహోరాత్రులు కష్టపడి పని చేశారు. మంచి విజయం సాధించారు. నాయకులు - కార్యకర్తలకు ధన్యవాదాలు. సమయాన్ని వృధా చేయకుండా ప్రజల కోసం పని చేయాలి. పాజిటివ్ కోణంలో వెళ్లాలి. కొత్త రాష్ర్టాన్ని ఒక బాటలో పెట్టాం.. గమ్యం చేరడానికి ప్రయత్నించాలి. కోటి ఎకరాలు పచ్చబడాలె. అది అయి తీరాలె. ఆ లక్ష్యం జరిగి తీరాలి. టీఆర్‌ ఎస్‌ ను గెలిపిస్తే కాళేశ్వరం.. కూటమిని గెలిపిస్తే శనేశ్వరం అని ఎన్నికల సమయంలో చెప్పాను. ప్రజలు కాళేశ్వరం కావాలనే మమ్మల్ని గెలిపించారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తాం. `` అని ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగానే ఏపీ రాజ‌కీయాల గురించి కేసీఆర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీ రాజకీయాల్లో కలుగజేసుకోవాలని కోరుతున్నారని ఆయ‌న అన్నారు. ``తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబు అంటుంటాడు. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్‌ కు ఉండొద్దా? తెలుగు ప్రజలు బాగుండాలని వంద శాతం కోరుకుంటున్నా. ఇవాళ ఉదయం నుంచి లక్ష పైనే ఏపీ నుంచి ఫోన్లు వచ్చాయి. వాట్సాస్ ద్వారా మేసేజ్‌ లు వచ్చాయి. ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలని కోరారు. తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే కలిసి పని చేయాలి. బర్త్‌ డే పార్టీ చేస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాకిచ్చిన గిఫ్ట్‌ కు...నేను ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుంటే బాగుండదు. చంద్రబాబు ఇక్కడ చేసినందుకు నేను అక్కడ చేయాలి కదా. దాని ఫలితం ఎలా ఉండబోతుందో చంద్రబాబు త్వరలో చూస్తారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణోళ్లు సంస్కారహీనులు అని మళ్లీ అంటారు`` అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా చంద్రబాబు గురించి కేసీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``చంద్ర‌బాబుకు పైత్యం ఉంది. చంద్రబాబు మోదీని అతిగా పొగడబోయి బొక్కబోర్లా పడ్డారు. ఆయ‌న ఏం చేశారనేది విజ‌య‌వాడ వేదిక‌గా వెల్ల‌డిస్తాం``అని కేసీఆర్ తెలిపారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని తేల్చిచెప్పారు. ``చైతన్యవంతమైన గడ్డ కాబట్టి దేశ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలి. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు నాయకులు కాదు. ఇండియాలో మెచ్చురిటీ రావాలి. ప్రధానమంత్రులు - కేంద్రమంత్రులు - ముఖ్యమంత్రులు - అన్ని పార్టీల పెద్దలు వచ్చి ప్రచారం చేశారు. అంతిమ నిర్ణయం ప్రజలు ఇచ్చారు. మమతా బెనర్జీ - సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా దేశంలో ఓ అనిశ్చితి ఉంది.. ఇది మారాలి. దేశంలో కాంగ్రెస్ - బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ - బీజేపీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చాం. తమకు ప్రజలే బాస్‌ లు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తాం`` అని కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తానని చెప్పారు.