Begin typing your search above and press return to search.

కడిగేయమని చెప్పటమే కాదు.. చాలానే క్వశ్చన్లు ఇచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   24 Aug 2019 4:10 AM GMT
కడిగేయమని చెప్పటమే కాదు.. చాలానే క్వశ్చన్లు ఇచ్చిన కేసీఆర్
X
చక్కటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కమలనాథులు చేసిన వ్యాఖ్యతో తన చేతికి బందర్ లడ్డూ దొరికినంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కొద్దికాలంగా తన పాలనపై అదే పనిగా విమర్శలు చేస్తున్నప్పటికి మౌనంగా ఉన్న కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు. కోపంతో క్వశ్చన్ల చిట్టాను విప్పారు.

విద్యుత్ శాఖ మీద కమలనాథులు చేస్తున్న విమర్శలపై కేసీఆర్ కు కోపం వచ్చింది. వరుస ప్రశ్నలు వేయటమే కాదు.. అదే పనిగా తమ పాలన మీద విమర్శలు చేస్తున్న కమలనాథుల్ని కడిగేయాలన్న ఆదేశాన్ని జారీ చేశారు. తక్కువ ధరకు కేంద్రం విద్యుత్ ఇస్తానన్నా.. కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నట్లుగా ఆరోపించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

తనకు పట్టున్న సబ్జెక్ట్ తో పాటు.. ఈ వ్యవహారంలో లోటుపాట్లు తక్కువగా జరిగిన నేపథ్యంలో.. కేసీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. అదే పనిగా అబద్ధాల్ని ప్రచారం చేస్తున్న కమలనాథులపై విరుచుకుపడాలంటూ తమ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఏదో మాట వరసకు అనేయటం కాకుండా విద్యుత్ విషయంలో తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి చెబుతూనే.. పలు ప్రశ్నల్ని సంధించటం ద్వారా తాము ఎలాంటి తప్పులు చేయలేదన్న భావనను కలిగేలా చేశారు. నేతలతో పాటు.. అధికారులు సైతం రియాక్ట్ కావాలని ఆదేశించారు.

కేసీఆర్ వేస్తున్న క్వశ్చన్లు చూస్తే..

% మణుగూరులో సబ్‌ క్రిటికల్‌ ప్లాంటుకు అనుమతి ఇచ్చింది బీజేపీ ప్రభుత్వానికి చెందిన కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి కాదా!?

% ఛత్తీస్‌గఢ్‌ లో బీజేపీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ అధికారంలో ఉన్నప్పుడు 1000 మెగావాట్ల విద్యుత్తుకు ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా?

% ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థతోనే ఒప్పందం జరిగింది. ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడిది?

% తెలంగాణ ఆవిర్భావ సమయంలో సౌర విద్యుత్తు 77 మెగావాట్లే. సౌర విద్యుత్తు పాలసీ తర్వాత దాని సామర్థ్యం 3600 మెగావాట్లకు చేరింది. దాంతో, జాతీయ స్థాయిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ సన్మానం కూడా చేశారు కదా?

% యూనిట్‌ విద్యుత్తు రూ.2.30కి ఇస్తామని ముందుకొచ్చిన ఎన్టీపీసీ ఆ తర్వాత తప్పుకొంది?

% తెలంగాణ వచ్చాక భూపాలపల్లిలో 600 మెగావాట్లు- మంచిర్యాలలో 1200 మెగావాట్ల సింగరేణి- 800 మెగావాట్ల కేటీపీఎస్‌- 120 మెగావాట్ల పులిచింతల ప్రాజెక్టులు పూర్తి కాలేదా?

% తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులన్నీ ప్రభుత్వ రంగ సంస్థలతోనే కట్టిస్తున్నది వాస్తవం కాదా!?

% జెన్‌ కో ఆధ్వర్యంలో వాటి నిర్మాణం జరుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ ఈఎల్‌ నిర్మిస్తోంది కదా! తెలంగాణ రావడానికి ముందు వ్యవసాయ కనెక్షన్లకు ఐదు గంటల కరెంట్‌ కూడా ఇచ్చేవారు కాదు. వారానికి రెండుసార్లు పవర్‌ హాలీడేస్ తో పరిశ్రమలు మూతపడలేదా?

% కరెంట్‌ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేయలేదా? తెలంగాణలో 24 గంటలపాటు అన్ని వర్గాలకూ కరెంట్‌ ఇస్తున్నాం కదా! వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్‌ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా?

% అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్నారా!?

అంటూ భారీ ఎత్తున ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కేసీఆర్ కు తగ్గట్లు.. విద్యుత్ అధికారులు.. నేతలు కమలనాథులపై క్వశ్చన్లు సంధించటం షురూ చేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ.. సీఎం సారు చెప్పినట్లు విద్యుత్ మీద చేస్తున్న ఆరోపణలపై కడిగేసే తీరులో ప్రశ్నిస్తే.. కమలనాథుల రియాక్షన్ ఏమిటన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.