Begin typing your search above and press return to search.

సెక్రటేరియట్ ను కేసీఆర్ కూల్చేయాలనుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   27 May 2016 5:02 AM GMT
సెక్రటేరియట్ ను కేసీఆర్ కూల్చేయాలనుకుంటున్నారా?
X
ఏదైనా ఇష్యూ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారంటే.. ఆ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చే వరకూ వదిలిపెట్టరు. ఏ ముహుర్తంలో ఇప్పుడున్న సచివాలయం మీద ఆయనకు వాస్తు సందేహాలు మొదలయ్యాయో కానీ.. అప్పటి నుంచి ఆయన సచివాలయాన్ని మార్చేసి.. తనదైన సచివాలయాన్ని ఏర్పాటు చేయాలన్న అంశంపై ఆయన చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు. సచివాలయాన్ని మార్చాలని చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవటంతో తాజాగా ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చేసి.. కొత్త భవనాలు నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

జూన్ మూడో వారం నాటికి సచివాలయంలోని ఏపీ కార్యాలయాలు అన్ని అమరావతికి వెళ్లిపోతున్న నేపథ్యంలో.. కూల్చివేతకు ఇదే సరైన సమయంగా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ కార్యాలయాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో.. సచివాలయలోని తెలంగాణ కార్యాలయాల్ని వేరే చోట్లకు మార్చేసి.. మొత్తంగా కూల్చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇందుకు సంబంధించిన ముహుర్తాలపైనా కాస్తంత కసరత్తుజరిగిందని తెలుస్తోంది.

ఇప్పటికిప్పుడు మంచి ముహుర్తాలు లేని విషయం తెలిసిందే. అయితే.. మంచిరోజులకు మరికొన్ని నెలల వ్యవధి ఉన్న నేపథ్యంలో తెలంగాణ సెక్రటేరియట్ ను తాత్కాలికంగా వేరే చోటకు తరలించాలని.. ఆ తర్వాత మొత్తంగా కూల్చేసి.. కొత్త భవనాల్ని నిర్మించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. తెలంగాణ ఖజానా మీద అదనపు భారం ఖాయమనే చెప్పాలి. భవనాలు పాతవి కావటమో.. శిధిలం కావటమో అయితే కూల్చివేత తప్పనిసరి. కానీ.. అందుకు భిన్నంగా కేవలం నమ్మకాల ఆధారంగా భవనాల్ని అడ్డంగా కూల్చేయాలని భావించటం ఏమాత్రం సమంజసం కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.