Begin typing your search above and press return to search.

కుల సంఘాలతో బాబుకు రిటన్ గిఫ్ట్

By:  Tupaki Desk   |   12 Jan 2019 7:16 PM GMT
కుల సంఘాలతో బాబుకు రిటన్ గిఫ్ట్
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి భారీ రిటన్ గిఫ్ట్‌ ను సిద్ధం చేస్తున్నారు తెలంగాణ మఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముగిసిన వెంటనే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడికి రిటన్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసింది. ఇందుకోసం అన్ని వైపుల నుంచి దారులు చేసుకుంటూ చంద్రబాబు నాయుడికి రిటన్ గిఫ్ట్ ఇవ్వాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలకు తప్పకుండా వెళ్లే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను తొలుత ప్రయోగించనున్నారని సమాచారం. సంక్రాంతికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్లే తలసాని శ్రీనివాస యాదవ్ అకడున్న మావుళ్లమ్మను దర్శించుకుంటారు. అనంతరం కోడి పందాలలో పాల్గొంటారు. మూడు - నాలుగు రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉండడం తలసారి శ్రీనివాస యాదవ్ చాలాకాలంగా చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆయన కోడి పందాలకు వెళ్లడం విశేషం.

ఈ సారి ఈ కోడి పందాలు - సంక్రాంతి పండుగను చంద్రబాబు నాయుడికి ఇచ్చే రిటన్ గిఫ్ట్ కోసం వినియోగించాలని భావిస్తున్నారు. తాను పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే ముందు విజయవాడలో భారీగా ర్యాలీ నిర్వహించాలని తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లోని యాదవ కుల సంఘాల నాయకులతో చెప్పారని అంటున్నారు. ఈ యాదవ కుల సంఘాలకు చెందిన వారితో తొలుత భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో తమ బలం - బలగం చూపించినట్లుగా ఉంటుందనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుకు కోస్తా జిల్లాలో సన్నిహిత మిత్రులు ఉన్నారు. వీరిలో క్షత్రీయులు - వెలమలు - కోమట్లు - బ్రాహ్మణులు ఉన్నారు. వీరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడి సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీపైనా చంద్రబాబుపైనా ఆగ్రహంతో ఉన్న వారు ఉన్నారు. వారందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చే పనిని తన సన్నిహితుడు - మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇలా ముందుగా తలసాని శ్రీనివాస యాదవ్ ను ప్రయోగించి దాని నుంచి వచ్చిన ఫలితాన్ని బట్టి ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాత్రం భారీ రిటన్ గిఫ్ట్ ఖాయంగానే కనిపిస్తోంది.