Begin typing your search above and press return to search.

హామీలు వందశాతం పూర్తి కావడమేంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   28 April 2016 4:34 AM GMT
హామీలు వందశాతం పూర్తి కావడమేంది కేసీఆర్?
X
తెలంగాణ ముఖ్యమంత్రి తెలివితేటల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనలో చతురత.. రాజకీయ వ్యూహం.. చాణక్యం లాంటివి టన్నులు టన్నులు ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాట్లాడే ప్రతి మాట వెనుక ఒక వ్యూహం ఉండటం కేసీఆర్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేస్తుందన్న విషయాన్ని ఎవరో చెప్పే కంటే.. తనకు తాను ప్రచారం చేసుకోవటానికి కేసీఆర్ ఇష్టపడతారు. విషయం ఏదైనా కన్వీన్స్ అయ్యేలా మాట్లాడటం కేసీఆర్ కు అలవాటే.

అందుకే.. ప్రభుత్వ పనితీరు మీద తాను కితాబులు ఇచ్చేసుకోవటమే కాదు.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల గురించి.. వాటి అమలు గురించి కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటారు. మొన్నా మధ్యన ఎన్నికల హామీల్ని 90శాతం పూర్తి చేశామని చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. మిగిలిన హామీలు గుర్తు లేకున్నా.. ఎన్నికల సమయంలో పదే పదే చెప్పిన మాట బంగారు తెలంగాణ. బంగారం దాకా ఎందుకు రాగి కూడా లేని పరిస్థితి. భవిష్యత్తు బంగారుమయం అని కేసీఆర్ అండ్ కో మాటలు చెబుతున్నా.. ఇప్పటికైతే గుక్కెడు నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు కిందామీదా పడుతున్న పరిస్థితి. ఇక.. జంటనగరాల నీటి తిప్పల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీల్ని 90 శాతం పూర్తి చేశామని ఆ మధ్యన పదే పదే చెప్పిన కేసీఆర్.. తాజాగా టీఆర్ ఎస్ ప్లీనరీ సందర్భంగా వందశాతం హామీల్ని అమలు చేసినట్లు చెప్పేశారు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఎన్నికల హామీల్లో 90 శాతం పూర్తి చేసినట్లుగా కోతలు కోసేసి కేసీఆర్.. ఆ విస్మయంలో నుంచి బయటకు రాకముందే.. తాజాగా వందశాతం హామీల్ని అమలు చేసినట్లుగా పేర్కొనటం విస్మయానికి గురి చేస్తుంది.

ఇంతకీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీల లిస్ట్ ఏంటి? అన్న లెక్కలోకి వెళ్లి.. ఒకటి తర్వాత ఒకటి సరిచూసుకోవటం లాంటివి పక్కన పెట్టి.. కాస్త మెమరీని ఉపయోగించి బండగా అందరికి గుర్తుండిపోయే అంశాల మీద ఫోకస్ చేస్తే.. కేసీఆర్ మాటల్లో ‘నేతి బీర’ చందం ఇట్టే అర్థమవుతుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన బంగారు తెలంగాణ సాధన లాంటి పెద్ద మాటల్ని వదిలేసి.. అందరి దృష్టిని ఆకర్షించేలా చెప్పిన కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య ఏమైందన్నది పెద్ద ప్రశ్న.

కొద్దిరోజుల క్రితం కేజీ నుంచి పేజీ ఉచిత విద్య గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పిన కేసీఆర్.. దానిపై ఎలాంటి ముందడుగు పడక ముందే.. వందశాతం హామీల్ని అమలు చేసినట్లుగా తనకు తాను ప్రకటించటం చూసినప్పుడు నోట మాట రాదంతే. తనకు తాను అన్ని హామీల్ని నెరవేర్చినట్లుగా తేల్చేసిన కేసీఆర్ కు.. ఆయన నెరవేర్చిన హామీల్ని గుర్తు చేస్తే పట్టించుకుంటారా? అన్నది పెద్ద ప్రశ్న. అలాంటి సోయి ఉంటే.. వందశాతం హామీలు అమలు చేసినట్లుగా ప్రకటించుకోరు కదా?