Begin typing your search above and press return to search.

కేసీఆర్ గ్రాఫ్ త‌గ్గుతోంది ఇందుకేనా?

By:  Tupaki Desk   |   23 Oct 2018 5:17 PM GMT
కేసీఆర్ గ్రాఫ్ త‌గ్గుతోంది ఇందుకేనా?
X
టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ అప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ గ్రాఫ్ శ‌ర‌వేగంగా త‌గ్గుతోందా? ఇటీవలి కాలంలో గులాబీ ద‌ళ‌ప‌తిలో పెరుగుతున్న అస‌హ‌నం వెనుక అస‌లు లెక్క ఇదేనా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత కేసీఆర్ గ్రాఫ్ వేగంగా ప‌డిపోతుంద‌నే విష‌యాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు సైతం అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో అంగీక‌రిస్తున్నార‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. ఇటీవ‌లి కాలంలో కేసీఆర్ `ఇంబ్యాలెన్స్‌`గా మాట్లాడేందుకు సైతం ఇదే కార‌ణ‌మ‌ని అంటున్నారు. అయితే ఎందుకు ఈ ప‌రిస్థితి ఎదురైంద‌నే ప్ర‌శ్న‌కు...అనేక అంశాలు కార‌ణంగా పేర్కొంటున్నారు.

కేసీఆర్ గ్రాఫ్ డౌన్ వెనుక అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న వ్య‌వ‌హరించిన తీరు ప్ర‌ధాన కారణ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. విధాన‌ప‌రంగా తీసుకునే నిర్ణ‌యాల్లో త‌ప్పిదం ఉన్న‌ప్ప‌టికీ...అణిచివేస్తాడేమోన‌నే భ‌యంతో అధికారంలో ఉన్న‌పుడు ఆయ‌నకు వ్య‌తిరేకంగా వార్త‌లు ప్ర‌చురించేందుకు - ప్ర‌చారం చేసేందుకు మీడియాకు ధైర్యం రాలేదు. సైబర్ క్రైమ్ కింద బుక్ చేస్తారేమోన‌ని సోష‌ల్ మీడియాలో కూడా స్త‌బ్దుగా ఉన్నారు. కొన్ని పార్టీల నేత‌లు సైతం స్పందించ‌లేదు. అయితే, ఎపుడైతే గ‌వ‌ర్న‌మెంటు ర‌ద్దు చేశాడో... అంద‌రూ త‌మ‌దైన శైలిలో స్పందించ‌డం మొదలుపెట్టార‌ని అంటున్నారు. కేసీఆర్ త‌ప్పుల‌పు - ఆయ‌న‌ నెర‌వేర్చ‌ని హామీల‌పై ముప్పేట దాడి మొద‌లైంది. అప్ప‌టివ‌ర‌కు సైలెంట్‌ గా ఉన్న మీడియా కూడా సహాయ నిరాక‌ర‌ణ చేస్తోందని ఇటీవ‌ల ప‌లు ఉదంతాల్లో స్ప‌ష్టమైంది.

ఇలా ఇటు పౌర‌స‌మాజం - అటు మీడియా మ‌రోవైపు దూకుడుగా సాగుతున్న విప‌క్షాల దాడితో....కేసీఆర్‌ ను ఇంకో కోణంలో ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని అంటున్నారు. మ్యానిఫెస్టోలో చెప్ప‌నివి కొన్ని చేసినా చాలా హామీలు కేసీఆర్ నెర‌వేర్చ‌క‌పోవ‌డం, విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు రాష్ట్ర భ‌విష్య‌త్‌ కు ఇబ్బందిక‌రంగా మార‌డం విష‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చేస‌రికి చాలా దారుణంగా కేసీఆర్ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని అంటున్నారు. ఇటీవ‌ల కేసీఆర్ ఏర్పాటు చేసిన స‌మావేశాల్లో ఈ విష‌యాన్ని ప‌రోక్షంగా తెలియ‌జెప్పార‌ని..అందుకే ``మ‌నం చేసింది ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా చేర‌వేయండి`` అంటూ ల‌బ్ధిదారుల వివ‌రాలు సైతం అందించార‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.