Begin typing your search above and press return to search.

మూసివేసేందుకు కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

By:  Tupaki Desk   |   27 Aug 2015 9:45 AM GMT
మూసివేసేందుకు కేసీఆర్ డిసైడ్ అయ్యారా?
X
సంక్షేమ హాస్టళ్లకు మంగళం పాడేందుకు... టీ-సర్కార్ వేగంగా పావులు కదుపుతోందా? విద్యార్థుల సంఖ్యను సాకుగా చూసి...పలు వసతి గృహాలను ఎత్తేసేందుకు వ్యూహాలు రచిస్తోందా? ఇదే క్ర‌మంలో ఆయా హాస్టళ్లలోని విద్యార్థులను ఇతర హాస్టళ్లకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోందా. ఈ ప్రశ్న‌ల‌న్నింటికీ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లను మూసివేసే దిశ‌గా సర్కారు సమాలోచనలు చేయ‌డం స‌రికాద‌ని డిమాండ్ లు వస్తున్నాయి.

సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. హాస్ట‌ల్ల‌లో వసతులపై సర్కారును ప్రతిపక్షాలు ఇరుకునబెడుతున్నాయి. దీంతో హాస్టళ్లను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ సిద్ధమైంది.

తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లన్ని పలు శాఖల కింద పనిచేస్తున్నాయి. దీంతో వాటి మధ్య ఎక్కడా పొంతన లేకుండాపోయింది. మెనూ నుంచి మొదలుకొని సిలబస్‌ వరకు అంతా భిన్నంగా ఉంటున్నాయి. దీంతో వాటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీసర్కార్ సిద్ధమైంది. శాఖల వారీగా కార్యదర్శులు సంక్షేమ హాస్టళ్ల పనితీరును అధ్యయనం చేస్తున్నారు. హాస్టళ్లలోని విద్యార్థుల సంఖ్య, సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న హాస్టళ్లను ఎత్తేసి..వారిని ఇతర హాస్టళ్లకు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. సిబ్బందిని కూడా పక్క హాస్టళ్లకు బదలాయించాలని భావిస్తోంది. తక్కువ సంఖ్యతో హాస్టళ్ల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారిందని అభిప్రాయపడుతోంది.

ఈ పరిస్థితుల్లో ఆయా చోట్ల హాస్టళ్లను నడపటం కంటే... అక్కడి విద్యార్థులను ఇతర హాస్టళ్లకు తరలించటం ఉత్తమమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అయితే ఈ ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను సేకరించాక ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది. అయితే విద్యార్థుల సంఖ్య సాకుగా చూపి హాస్టళ్లను మూసివేయవద్దని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. సరైన మౌళిక వసతులు కల్పిస్తే....నిర్దేశిత సంఖ్యకన్నా ఎక్కువ మంది విద్యార్థులు హాస్టళ్లలో చేరుతారని సూచిస్తున్నాయి. ప్రభుత్వం హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని మానుకొని వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.