Begin typing your search above and press return to search.

విభజన చట్టానికి ఎసరు పెడుతున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   20 Oct 2016 6:23 AM GMT
విభజన చట్టానికి ఎసరు పెడుతున్న కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు ఆసక్తికరంగా.. కొత్త చర్చకు తెర తీసేలా మారాయి. విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ.. పదేళ్ల కాల వ్యవధిని నిర్ణయించటం తెలిసిందే. చట్టంలోని ఈ అంశంపై తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన కేసీఆర్ తో సహా.. ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసింది లేదు. అలాంటి గడిచిన రెండు.. మూడురోజుల్లో ప్రభుత్వం తీసుకుంటున్ననిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి.

వసతుల లేమి పేరిట సచివాలయాన్ని నేలమట్టం చేసి.. దాని స్థానే కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న ఆలోచనతో ఉన్న తెలంగాణ సర్కారు.. తాజాగా సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీ చేసి.. తమకు అప్పగించాల్సిందిగా కోరాలంటూ గవర్నర్ నరసింహన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా ప్రత్యామ్నాయ భవనాల్ని తాము కేటాయిస్తామని పేర్కొన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ స్పందించ లేదు.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసి.. హైదరాబాద్ లోని సచివాలయాన్ని తరలించిన నేపథ్యంలో.. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పరిగణించాల్సిన అవసరం లేదన్న వాదనను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

విభజన చట్టంలో పేర్కొన్నట్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పరిగణించకుండా నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చేలా కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చిందని.. పరిపాలన మొత్తం వెలగపూడి నుంచి సాగుతున్న వేళ.. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పేర్కొనకుండా.. తెలంగాణకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నట్లుగా చెబుతున్నారు. ఉన్నట్లుండి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తుందన్న వాదనకు ఆసక్తికరమైన అంశాన్ని చెబుతున్నారు.

ఇప్పుడున్న సచివాలయంలో భవనాలు ఖాళీ చేయించాలంటే అందుకు ఏపీ సర్కారు ఆమోదం తప్పనిసరి. ఒకవేళ.. ఏపీ సర్కారుకానీ తమకు కేటాయించిన భవనాలు ఖాళీ చేయమని తేల్చి చెబితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు కొత్త సచివాలయాన్ని నిర్మించే అవకాశం ఉండదు. అది ఇప్పటికే కాదు.. మరో ఎనిమిదేళ్ల వరకూ సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణతో పాటు.. ఏపీకి కూడా ఉమ్మడి రాజధానిగా ఎంతోకొంత భాగస్వామ్యం ఉండటమే. ఆదాయ పరంగా ఏపీకి హైదరాబాద్ ఎలాంటి హక్కు లేకున్నా.. సచివాలయంలో భవనాలు లాంటి కొన్ని అంశాల్లో ఏపీకి అవకాశం ఉంటుంది.

రాజకీయంగా ఉప్పు.. నిప్పు లాంటి తెలంగాణ అధికారపక్షానికి అనుకూలంగా ఏపీ అధికారపక్షం ఓకే అనే అవకాశం లేదనే చెప్పాలి. అందులోకి ఇప్పుడున్న సచివాలయాన్ని నేలమట్టం చేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పు పడుతోంది. అయితే.. విపక్షాల అభ్యంతరాల్ని తెలంగాణ అధికారపక్షం పరిగణలోకి తీసుకునే అవకాశం లేని నేపథ్యంలో.. తమ పార్టీకే చెందిన ఏపీ అధికారపక్షం చేత అడ్డుపుల్ల వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి చెక్ చెప్పాలంటే.. ఏపీతో హైదరాబాద్ కు సంబంధించిన లింకులన్నీ తెగ్గొట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగానే.. హైదరాబాద్ ను ఏపీకి రాజధానిగా ఉండే నిర్ణయాన్ని తీసేయాలన్న చర్చను తెరపైకి తెచ్చిందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను ఏపీని తీసేసి.. తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయాలన్న వాదనను తెరపైకి తీసుకురానున్న తెలంగాణ సర్కారు నిర్ణయంపై ఏపీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/