Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఆర్నెళ్లు.. కేసీఆర్ రెండేళ్లు

By:  Tupaki Desk   |   3 Oct 2015 12:08 PM GMT
చంద్రబాబు ఆర్నెళ్లు.. కేసీఆర్ రెండేళ్లు
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆర్నెళ్లలో చేసిచూపించిన సంగతి తెలిసిందే. చిన్నపాటి లోపాలు తలెత్తినా పథకానికి మాత్రం ఆర్నెళ్లలో పూర్తి రూపమొచ్చేసింది. కొద్దినెలల్లో మొత్తం సరిచేసి పూర్తి ఉపయోగంలోకి తేనున్నారు.

... ఇదేసమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి తొందరపడుతున్నారు. అయితే... ఆయన దీనికి పెట్టుకున్న టార్గెట్ రెండేళ్లు... పట్టిసీమతో పోల్చితే ఇది ఎక్కువ కాలమే. అయితే... ఆయన రెండేళ్లలో పూర్తిస్థాయిలో ఎక్కడా లోపం లేకుండా చేసి నిరూపించుకోవాలని తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పాలమూరు ఎత్తిపోతల పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశాలిచ్చారు.

పంప్ హౌస్ లు - కాల్వలు - రిజర్వాయర్లు - టన్నెల్స్ పనులన్నీ ఏకకాలంలో చేపట్టి కొనసాగిస్తే అనుకున్న సమయంలో పూర్తవడం ఖాయమని కేసీఆర్ ఆదేశాలిచ్చారు. కాగా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నార్లాపూర్ - ఏదుల - వట్టెం - ఉద్దండాపూర్ - హేమసముద్రం రిజర్వాయర్లు నిర్మించబోతున్నారు. వీటికి రెండు వారాల్లో సర్వే పనులు పూర్తి చేసి టెండర్లు పిలవాలని, ప్రాజెక్టులపై ప్రతి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష జరపాలని కేసీఆర్ ఆదేశించారు. ఈసారి బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకే భారీగా కేటాయించబోతున్నారు.

మొత్తానికి పట్టిసీమతో చంద్రబాబుకు వచ్చిన ఇమేజి కేసీఆర్ పై బాగానే పనిచేసినట్లుంది. ఆయన కూడా తొలుత ఎత్తిపోతలకే ప్రాధాన్యిమిస్తూ ముందుకెళ్లబోతున్నారు. ఇలా అభివృద్ధిలో పోటీపడితే మంచిదేకానీ అనవసర విషయాల్లో పోటీ మాత్రం తగదు.