Begin typing your search above and press return to search.

సీఎం కూడా బడాయి డబాయింపులేనా?

By:  Tupaki Desk   |   25 Sep 2016 4:25 AM GMT
సీఎం కూడా బడాయి డబాయింపులేనా?
X
జనం ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఛోటా మోటా నాయకులు ఎవరైనా డాంబికపు పనికిరాని ప్రకటనలు చేస్తే.. జనం వెళ్లి ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటారు. అయితే.. ముఖ్యమంత్రి కూడా.. అలాగే బడాయి ప్రకటనలు - డబాయింపులు చేస్తే వారేం చేయగలరు? హైదరాబాదు నగరంలో పరిస్థితుల్ని చక్కదిద్దడంపై సీఎం కేసీఆర్‌ స్పందన చూసిన వారికి ఇలాగే అనిపిస్తోంది. నగరంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులకు నాలాలపై అక్రమ కట్టడాలు ఒక కారణం సరే.. వాటిని కూల్చేస్తాం అంటూ కేసీఆర్‌ హెచ్చరిస్తున్నారు సరే.. కానీ నగర రోడ్లను నిందించిన వారి మీద ఆయన సెటైర్లు వేయడాన్ని జనం సహించలేకపోతున్నారు.

భాగ్యనగరంలో రోడ్లు చాలా చండాలంగా తయారయ్యాయి. మొత్తం జంటనగరాల్లో అదీ ఇదీ, పోష్‌ కాలనీలు అనే వ్యత్యాసాలేమీ లేకుండా ఉండే సమస్త రోడ్లు ఎంతో కొంత దెబ్బతిన్నాయన్నది నిజం. రోడ్లు మొత్తం కొన్ని అడుగుల కొద్దీ గోతులతో నిండి.. వాహనాలను సర్వనాశనం చేసేస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయి. ఇంతలా జనం రోడ్లను తిట్టుకుంటూ ఉంటే.. కేసీఆర్‌ మాత్రం వాటికి కితాబులు ఇస్తున్నారు.

బహుశా కేసీఆర్‌ వీటిని కేసీఆర్‌ అడ్డంగా సమర్థించడానికి మరో కారణం కూడా ఉండొచ్చు. ప్రత్యేకించి నగర రోడ్ల విషయంలో కేసీఆర్‌ సర్కారు గద్దె ఎక్కిన తర్వాత వేసిన రోడ్లు కూడా అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నాశనం అయిపోయాయి. బాగాలేవని ఒప్పుకుంటే ఆ పాపం తమకు అంటుకుంటుందని భావించారేమో గానీ కేసీఆర్‌ రోడ్లను సమర్థిస్తున్నారు. మీడియా గోరంతలు కొండంతలు చేసి రాస్తుందని , ప్రపంచం మొత్తం మునిగిపోయినట్లుగా రాస్తున్నారని అంటున్నారు.

అయినా జనానికి స్పష్టంగా తెలిసిన విషయాల్లో కూడా ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఇలా డాంబికాల్తో డబాయింపులతో తప్పించుకోవాలని చూడడం సమర్థనీయం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.