Begin typing your search above and press return to search.

ఫ్యూచర్ లో కేసీఆర్ కూ ఆ అవమానం తప్పదా?

By:  Tupaki Desk   |   7 Feb 2016 11:30 AM GMT
ఫ్యూచర్ లో కేసీఆర్ కూ ఆ అవమానం తప్పదా?
X
మజ్లిస్ తో దోస్తానా అంటే చిన్న విషయం కాదు. ఆ పార్టీ స్నేహంగా ఉంటూనే షాకులిచ్చే సత్తా సొంతం. ఆ పార్టీ ఎవరితో స్నేహహస్తం చాచినా అలాంటి వారందరికి షాకుల మీద షాకులు తగిలిన విషయం మీద సందేహాలు అక్కర్లేదు. చరిత్రను చూస్తే చాలు.. అదెంత నిజమన్న విషయం ఇట్టే తెలుస్తుంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనవరి 31న పాతబస్తీలో నిర్వహించిన ఒక సభను ఉద్దేశించి ప్రసంగించిన మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీనే దారుస్సలాం వచ్చారు కానీ.. తామెప్పుడూ గాంధీ భవన్ లో అడుగుపెట్టలేదంటూ.. దశాబ్దాల తరబడి దోస్తానా నడిచిన కాంగ్రెస్ గురించి వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. అవసరమైతే మోడీతో కలిసి కాంగ్రెస్ పాడె కడతామని.. దాన్ని ఊరేగిస్తామంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ తో మజ్లిస్ కు ఉన్న అనుబంధం ఎంతో అందరికి తెలిసిందే. రాజకీయాల్లో శాశ్విత శత్రుత్వం.. శాశ్విత మిత్రత్వం ఉండదు. అదే సమయంలో.. ఈ స్థాయి మాటలు రాజకీయ పార్టీల నోటి నుంచి రావు. కానీ.. మజ్లిస్ నేతల నోటి నుంచి అహంకారపూరిత వ్యాఖ్యలు చాలామామూలుగా వచ్చేస్తుంటా.

ఆ పార్టీతో తాజాగా దోస్తీ చేస్తున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మజ్లిస్ తో ఫ్రెండ్ షిప్ గురించి మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మజ్లిస్ తో దోస్తానా వారికే లాభం తప్పించి.. టీఆర్ ఎస్ కు ఏ మాత్రం లాభించదని.. అవసరమైతే అవమానమే మిగులుతుందన్న మాట వినిపించటం గమనార్హం. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూస్తే.. గ్రేటర్ మొత్తం చుట్టేసిన కారు.. పాతబస్తీలోకి మాత్రం ఎంటర్ కాలేకపోయిన విషయం మర్చిపోకూడదు. స్నేహపూర్వక పోటీ అని చెప్పినప్పటికీ.. మజ్లిస్ నేతలు ఎంత సీరియస్ గా వ్యవహరించారో పోలింగ్ రోజున తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ ఇంటిపై దాడితోనే వారి వ్యవహారం అర్థం కాక మానదు.

తామేం చేసినా నడిచిపోవాలని.. ఓల్డ్ సిటీ వైపు కన్నెత్తి చూడకూడదన్న షరతు పెట్టే మజ్లిస్ నేతలు మాటలు విని.. ఏమవుతుందన్న భరోసాతో వ్యవహరించిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారు ఈ రోజు ఓవైసీ బ్రదర్స్ చెబుతున్న మాటలు వింటే.. తామెంత పెద్ద తప్పు చేశామన్న బాధకు తప్పనిసరిగా గురి అవుతారు. మజ్లిస్ తో ఫ్రెండ్ షిప్ అన్నది అవసరం కోసం చేస్తున్నారన్న భావనలో ఓవైసీ సోదరులు ఉంటారు. ఎంతటి వారైనా తమ వద్దకే రావాలే కానీ.. తాము ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్న పొగరు వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

అందుకు నిదర్శనమే.. ఇందిర ప్రస్తావన. ఇందిర లాంటి నేతనే పూచికపుల్లతో సమానంగా తీసేసి ఓవైసీ బ్రదర్స్.. కేసీఆర్ లాంటి వారు పెద్ద విషయమేమీ కాదన్నది మర్చిపోకూడదు. ఒకవేళ మజ్లిస్ ఏమైనా పీకుడు పార్టీనా అంటే అదీ ఉండదు. నిజానికి ఓవైసీ బ్రదర్స్ చెప్పే మాటలకు తగ్గట్లే వారి చేతలు ఉండి.. పాతబస్తీ కానీ అభివృద్ధి చెంది.. అక్కడి ప్రజలు కానీ ఆలోచించే పరిస్థితే వస్తే.. తాజా గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండేవి కాదు. దశాబ్దాల పర్యంతం తామే ప్రాతినిధ్యం వహిస్తున్న పాతబస్తీలో ఇప్పటికి అభివృద్ధి ఎందుకు లేదు? పాతబస్తీ వాసుల బతుకుల్లో మార్పు ఎందుకు రావటం లేదన్నది చూస్తే.. ఓవైసీ సోదరులు ఎలాంటివారో ఇట్టే అర్థమవుతుంది.

తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్న కేసీఆర్ కు.. మజ్లిస్ బలం పెద్ద బలంగా అనిపించకపోవచ్చు. దోస్తానా మత్తులో ఆయన కానీ వాస్తవాన్ని వదిలేస్తే.. అది భవిష్యత్తులో దెబ్బేయక మానదు. ఈ రోజు బలం రేపు ఉండకపోవచ్చు. ఒకసారి బలం తగ్గి బలహీనత పెరిగితే.. మొహమాటం లేకుండా బంధం తెంచుకెళ్లే వైఖరి ఓవైసీ బ్రదర్స్ కు కొత్తేం కాదు. అదే జరిగితే.. ఈరోజు దన్నుగా నిలిచిన స్నేహితుడు రేపొద్దున గుదిబండగా మారతారని చెప్పక తప్పదు.

మరో కీలకమైన అంశం ఏమిటంటే.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మజ్లిస్ తమ మిత్రపక్షమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు (గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో నిర్వహించిన సమావేశంలోనూ.. గ్రేటర్ గెలుపు తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో) ప్రస్తావించారే కానీ.. ఓవైసీ బ్రదర్స్ ఇద్దరిలో ఏ ఒక్కరూ గ్రేటర్ ప్రచారంలో ప్రస్తావించలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని రేపొద్దున ఏదో ఒకరోజు ఓవైసీ బ్రదర్స్ ప్రస్తావించి.. కేసీఆరే దోస్తానా గురించి మాట కలిపారే కానీ.. తామెప్పుడూ మాట్లాడలేదంటే.. అంతకు మించిన అవమానం మరింకేం ఉంటుంది. అలా అనిపించుకోవాలని కేసీఆర్ కు ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు?