Begin typing your search above and press return to search.

కేసీఆర్ బలం.. బలహీనత అతడే..

By:  Tupaki Desk   |   22 Jun 2018 3:30 PM GMT
కేసీఆర్ బలం.. బలహీనత అతడే..
X

తెలంగాణ కేబినెట్ లో మంత్రులందరూ ఉన్నారు. కానీ ఎవ్వరికి చెప్పినా అంతో ఇంత జాప్యం అవుతుంది. కానీ ఆ ఒక్కడికి చెబితే మాత్రం పనులు వేగంగా అవుతాయి. అటు పార్టీలోనూ.. ఇటు ప్రభుత్వంలో మంత్రి హరీష్ వేస్తున్న ముద్ర అంతా ఇంతా కాదు.. ఆపద లో ఉన్నామని ఎవ్వరూ కాల్ చేసినా ఇట్టే అక్కడి వాలిపోతాడు.. తాజాగా మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్టు కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం హరీష్ రావు సొంతంగా 25వేలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ ఎస్ లో పనిరాక్షసుడిగా హరీష్ రావుకు పేరుంది. అందుకే కేసీఆర్ ఏరికోరి తెలంగాణ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే బాధ్యతను హరీష్ రావు మీద పెట్టాడు. మామ నమ్మకాన్ని హరీష్ వమ్ము చేయలేదు. జర్మనీ - చైనా ఇంజినీర్లను తీసుకొచ్చి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర జలవనరుల సంఘం అధికారులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు స్పీడు - టెక్నాలజీ చూసి నోరెళ్లబెట్టారు. హరీష్ పట్టుకుంటే ఆ పని పూర్తయినట్టేనని టీఆర్ ఎస్ లో బలంగా నాటుకుపోయింది.

హరీష్ రావు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి అయ్యాక గుట్టుచప్పుడు కాకుండా ప్రాజెక్టులు - రిజర్వాయర్ లు - చెక్ డ్యాంలు నిర్మింపచేస్తున్నారు. కేసీఆర్ తో ఫైట్ చేసి మరీ నియోజకవర్గానికి రెండు మూడు రిజర్వాయర్ లు - పలు చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారు. ఇక చెరువుల మరమ్మతులు అయితే లెక్కేలేదు.

హరీష్ రావు పనితనంపై టీఆర్ ఎస్ లో కథలు కథలుగా చెబుతారు. తాజాగా హరీష్ రావు రాజన్న సిరిసిల్ల - జగిత్యాల - నిజామాబాద్ సరిహద్దుల్లో ఉన్న చిన్న సూరమ్మ చెరువును రిజర్వాయర్ గా మార్చేందుకు ఈరోజు భూమిపూజ చేశారు. దీనికి 200 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు మొదలు పెట్టాడు. నిజానికి ఈ రిజర్వాయర్ ను వానలు పడితేనే నింపడానికి అవకాశం ఉంటుంది. ఎస్పారెస్పీలో ఒకవేళ వరద వస్తే అక్కడి నుంచి రిజర్వాయర్ ను నింపుతారు.. 45వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. దాదాపు 47 గ్రామాల రైతులకు నీరందించవచ్చు. ఏడాదిలో పూర్తి చేసేందుకు హరీష్ ప్లాన్ చేశారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా హరీష్ రావు తన పనితనాన్ని ఉపయోగించి ఆ ప్రాంత ప్రజల సాగు - తాగునీటి అవసరాలను తీరుస్తున్నాడు. కరీంనగర్ జిల్లా ధర్మారంలో కూడా అండర్ టన్నెల్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వనని రైతులు అంటే ఏకంగా జర్మని ఇంజనీర్లతో భూగర్భంలోనే 27 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీతో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి హరీష్ ఔరా అనిపించారు.

ఎంతో పనిచేస్తున్న హరీష్ రావు తన కొడుకు కేటీఆర్ కు సరైన పోటీ అని కేసీఆర్ భావిస్తున్నాడు. మంత్రి కేటీఆర్ ను ఎంత ఫోకస్ చేస్తున్నా.. పని - వేగంలో హరీష్ రావును కేటీఆర్ అందుకోలేకపోతున్నాడని టీఆర్ ఎస్ ముఖ్యుల అభిప్రాయం. ఈ విషయం కేసీఆర్ కు తెలుసు. అందుకే తను ఉన్నప్పుడు కొడుకు కేటీఆర్ ను సీఎం చేసి వారసత్వ రాజకీయ పీఠాన్ని సామరస్యంగా ముగించాలని కేసీఆర్ భావిస్తున్నాడట.. అందుకే జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిసారిస్తున్నారు. కొడుకే కేటీఆర్ ను తెలంగాణ సీఎంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అయితే పక్కలో బల్లెంలా హరీష్ రావు తన పని తనంతో మామకు కలవరపెడుతూనే ఉన్నాడు. చూడాలి మరి కేసీఆర్ కు బలం.. బలహీనత అయిన హరీష్ రావు ఈ పొలిటికల్ గేమ్ లో ఎలా వ్యవహరిస్తాడో..