దండేయకపోతే దెబ్బ పడేట్టుంది కేసీఆర్.

Mon Apr 16 2018 21:00:01 GMT+0530 (IST)

ప్రజాస్వామ్యంలో ప్రజలు దేనినైనా సహిస్తారు. కానీ.. అహంకారాన్ని ఒక పట్టాన ఇష్టపడరు. ఎంత తోపు అయినా ఫర్లేదు అహంకారంతో కూడిన వ్యాఖ్యలు.. చేష్టలు వారికి మంట పుట్టిస్తాయి. అందుకే అవినీతి ఇష్టారాజ్యంగా చేసే అధినేత విషయంలో పెల్లుబికే వ్యతిరేకతతో పోలిస్తే.. అహంకారంతో వ్యవహరించే నేత విషయంలో ప్రజలు తగిన శాస్తి చేయటం మామూలే.వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా వ్యవహరిస్తూ.. తియ్యటి మాటలు చెప్పే ప్రధాని మోడీ ప్రసంగాల్ని ఎంతో ఆసక్తితో యావత్ భారతం వింది. అయితే.. ఆ మాటలన్నీ తన అవసరం కోసం మాత్రమే కానీ.. నిజంగా ప్రజలు బాధలు ఎదుర్కొన్నప్పుడు.. వారికి కష్టం వచ్చినప్పుడు మాత్రం మోడీ రియాక్ట్ కారని.. పట్టనట్లుగా వ్యవహరిస్తుంటారన్న విషయాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఇప్పుడాయన అహంకారాన్ని తట్టుకోలేకపోతున్నారు. నాలుగు నెలల క్రితం కూడా తిరుగులేనట్లుగా ఉన్న మోడీ గ్రాఫ్ ఇప్పుడు దారుణంగా దెబ్బతిన్నదంటే దానికి కారణం మోడీ స్వయంకృతాపరాధమేనని చెప్పాలి.

మోడీ చేసిన తప్పులన్నీ ఒక ఎత్తు అయితే.. బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ముకుళ హస్తాలతో మోడీకి నమస్కరిస్తే.. ఆయన కనీసం అద్వానీ వంక చూడకుండా తన దారిన తాను పోవటాన్ని భారతీయులు తమ మనసుల్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఉదంతం మోడీని చేసినంత డ్యామేజ్ మరేమీ చేయలేదని చెప్పాలి. ఓ లక్ష కోట్ల అవినీతిని సైతం ప్రజలు ఓకే అనుకునే వారేమో?  కానీ.. తనకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిన పెద్దమనిషిని పట్టించఉకోకుండా విపరీతమైన అహంకారంతో వ్యవహరించిన వైనం జాతి జనుల మనుసుల్లో మోడీకి మైనస్ మార్కులు వేసేశారు.

ఇప్పుడు ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తనను తాను గొప్ప వ్యక్తిగా.. తనకు మించిన మేధావి ఉండరన్నట్లుగా కేసీఆర్ మాటలు కొన్నిసార్లు ఉంటాయి. వాస్తవికతకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ అప్పుడప్పడు అతిశయాన్ని ఎక్కువగా ఇష్టపడే కేసీఆర్.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నట్టుగా చెప్పక తప్పదు.

మిగిలినవన్నీ వదిలేసినా.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన చేతులతో తాను స్వయంగా ఒక దండ వేసింది లేదు. ఇలాంటి పోకడులు కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.ఆయనది అహంకారంగా విపక్షాలు మండిపడుతున్నాయి. ఇలాంటి సందేశాలు ప్రజల్లోకి వెళ్లక ముందే కేసీఆర్ జాగ్రత్త పడితే మంచిది లేదంటే.. ఆయన అహంకారం సంగతేమో కానీ ఆ పేరుతో భారీగా డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. అందకే.. ఏదైనా ప్రముఖుడి జయంతి.. వర్థంతులు వస్తే.. వారికి ఫోటో కాస్తంత దండ వేస్తే బాగుంటుంద్న అభిప్రాయాన్ని చాలామంది చేస్తున్నారు సార్!