రాజకీయాల్లోకి దిల్ రాజు?

Sun Aug 13 2017 14:39:45 GMT+0530 (IST)

నిర్మాతలు చాలామంది ఉన్నా సెలబ్రిటీ నిర్మాతలు చాలా చాలా తక్కువగా ఉంటారు. అలాంటి సెలబ్రిటీ నిర్మాతగా దిల్ రాజును చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా సక్సెస్ అవుతోంది. ఇటీవల ఆయన తీసిన ఫిదా విజయవంతం కావటం ఒక ఎత్తు అయితే.. పెద్దగా సినిమాలు చూడని తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మనసు దోచుకోవటం మరోఎత్తు. ఈ సినిమాను చూసిన సందర్భంగా తెలంగాణ పట్ల దిల్ రాజుకున్న ప్రేమకు కేసీఆర్ పిదా అయినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజుకు ఒక ఊహించని ఆఫర్ ను సీఎం కేసీఆర్ ఇచ్చినట్లు చెబుతున్నారు.టీఆర్ ఎస్ వర్గాల సమాచారం ప్రకారం దిల్ రాజును రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజు సామాజిక వర్గంతో పాటు.. ఆయనకు తన సొంత ప్రాంతంలో ఉన్న పట్టు నేపథ్యంలో 2019 ఎన్నికల్లో లోక్ సభ స్థానం టికెట్టును ఇస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ నోటి నుంచి టికెట్టు ఇస్తానన్న మాటతో దిల్ రాజు పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లుగా సమాచారం.

నిజానిమాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజుకు అయితే నిజామాబాద్ జిల్లా ఎంపీ టికెట్ కానీ.. జహీరాబాద్ పార్లమెంటు టికెట్టు కానీ ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహరిస్తున్నారు. అయితే.. 2019 ఎన్నికల్లో ఆమె అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజుకు కేసీఆర్ తాజా ఆఫర్ ఇచ్చి ఉంటారని చెబుతున్నారు. సినిమా నిర్మాతలు రాజకీయాల్లో ఒక వెలుగు వెలగటం గతంలోనే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఒకరుగా పేరున్న దిల్ రాజు.. అనుకున్నట్లు జరిగితే 2019 ఎన్నికల బరిలో తెలంగాణ అధికారపక్షం తరఫు నిలబడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇదంతా ఊహాగానమని వినిపిస్తున్నా.. ఇది సాధ్యం కావటానికి అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.