Begin typing your search above and press return to search.

కేసీఆర్ చేయకూడని తప్పు చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   5 Oct 2015 8:49 AM GMT
కేసీఆర్ చేయకూడని తప్పు చేస్తున్నారా?
X
ప్రత్యర్థులపై పై చేయి సాధించాలంటే ఏం చేయాలి? లేదంటే.. లక్ష్యం చేరేందుకు అడ్డుగా ఉండే అంశాలన్నింటిని ఒకేసారి అధిగమించటం ఎంతటి వారికైనా కష్టమే. చిన్నప్పుడు చదువుకున్న కథలో చెప్పినట్లు.. పుల్లల మోపును విరవటం కష్టం కానీ.. పుల్లను కాదు కదా. ఇదే సూత్రాన్ని నిన్న మొన్నటి వరకూ అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మర్చిపోయారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా.. విభజించి పాలించే ధోరణితో వ్యవహరించిన కేసీఆర్.. విపక్షాల విషయంలో ఎవరికి వారిగా టార్గెట్ పెట్టి వారి సంగతి చూసేవారు. విపక్షాల మధ్య సహజంగా ఉండే వైరం ఐక్యమత్యానికి అవకాశం ఇవ్వలేదు. దీనికి భిన్నంగా.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీ ఎమ్మెల్యేల్ని (మజ్లిస్ ను మినహాయించి) సస్పెన్షన్ వేటు వేయటం.. అది కూడా ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు కావటం ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతున్న పరిస్థితి.

నిన్నటి వరకూ విపక్షాలు కలిసేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని కేసీఆర్.. తాజా చర్యతో వారంతా కలిసి పోరాటం చేసే అవకాశం ఇచ్చినట్లు అయ్యిందన్న వాదన వినిపిస్తోంది. విపక్షాల్ని మూకుమ్మడిగా కలిసి పోరాటం చేస్తే.. ఎంత పెద్ద ప్రభుత్వానికైనా ఇబ్బందే. ఇక.. తెలంగాణలోని విపక్షానికి.. ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణలో వివిధ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తుంటే.. ఏపీలో అందుకు భిన్నమైన పరిస్థితి. ఏపీలో కేవలం మూడంటే మూడు పార్టీలు మాత్రమే ఉన్నాయి. అందులో అధికారపక్షమైన తెలుగుదేశం.. దాని మిత్రపక్షమైన బీజేపీని పక్కన పెడితే.. విపక్షంగా ఉన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. కానీ.. తెలంగాణలో అందుకు భిన్నమైన పరిస్థితి.

సంఖ్యా పరంగా తక్కువగా ఉన్నప్పటికీ.. విపక్షాలన్నీ కలిస్తే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీదా.. దాని వైఖరి మీద వ్యతిరేక ప్రచారం ముమ్మరం కావటం ఖాయం. దీనికి తోడు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లాంటి భావోద్వేగ సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో విపక్షాల విషయంలో కేసీఆర్ కరుకుగా ఉండటం ద్వారా మరిన్ని సమస్యల్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకూ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పడు అందుకు భిన్నంగా తొందరపాటుతో అడుగులేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.