Begin typing your search above and press return to search.

మంద‌కృష్ణ విష‌యంలో ఆ సీఎం అలా చేశారా?

By:  Tupaki Desk   |   5 Aug 2015 8:37 AM GMT
మంద‌కృష్ణ విష‌యంలో ఆ సీఎం అలా చేశారా?
X
ద‌ళిత ఉద్య‌మ‌నేత‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడైన మంద‌కృష్ణ మాదిగ‌కు కొత్త అనుభ‌వం ఎదుర‌వుతుంది. గ‌త ప‌ద్నాలుగు నెల‌లుగా ఊరుకున్న ఆయ‌న‌.. తాజాగా మాత్రం త‌న‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందిక‌ర ప‌రిస్థితి దాచుకోకుండా బ‌య‌ట‌పెట్టేశారు.

నిజానికి ఆయ‌న కోరుకోవాలే కానీ.. ముఖ్య‌మంత్రుల అపాయింట్ మెంట్ పెద్ద క‌ష్టం కాదు. కానీ.. అంద‌రి సీఎంల ద‌గ్గ‌ర న‌డిచిన‌ట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌గ్గ‌ర న‌డ‌వ‌ద‌న్న విష‌యం కాస్త ఆల‌స్యంగా ఆయ‌న‌కు అర్థ‌మైంది. ఒక ఉద్య‌మ‌నేత‌గా.. భారీ ఉద్య‌మాన్ని సుదీర్ఘ‌కాలం న‌డిపిన ఆయ‌న‌కు.. ఎవ‌రిని ఎక్క‌డ ఉంచాలో చాలా బాగా తెలుస‌న్న వ్యాఖ్య‌కు త‌గ్గ‌ట్లే తాజాగా ఆయ‌న తీరు ఉంద‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌లిసేందుకు గ‌త ప‌ద్నాలుగు నెల‌లుగా తాను ప్ర‌య‌త్నిస్తున్నా.. ఆయ‌న అపాయింట్ మెంట్ మాత్రం దొర‌క‌టం లేద‌ని వాపోయారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేసే మంద‌కృష్ణ‌కు.. మిగిలిన ముఖ్య‌మంత్రుల మాదిరి అపాయింట్‌ మెంట్ ఇచ్చి బుజ్జ‌గించ‌టం.. ఆయ‌న వాద‌న‌ను విన‌టం లాంటివి కేసీఆర్ చేయ‌లేద‌న్న విష‌యం తాజా వ్యాఖ్య‌తో అర్థ‌మ‌వుతుంది.

నిజానికి మంద‌కృష్ణ‌కు మాత్ర‌మే కాదు.. త‌న‌కు న‌చ్చ‌ని వారి విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కాస్తంత క‌టువుగానే ఉండ‌టం తెలిసిందే. నిజానికి అపాయింట్ మెంట్ ఇవ్వ‌కుండా షాకివ్వ‌టం మంద‌కృష్ణకు మాత్ర‌మే కాదు.. ఇప్ప‌టికే ఇలాంటి షాకులు చాలామందికే జ‌రిగాయి.

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణ‌స్వీకారం చేప‌ట్టిన త‌ర్వాత ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన ప్రొఫెస‌ర్‌ కోదండ‌రాంకు ఎదురైంద‌ని చెబుతారు. దీనిపై మీడియాలో వార్త‌లు రావ‌టం.. ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మార‌టంతో అపాయింట్‌ మెంట్ ఇచ్చిన‌ట్లుగా చెబుతారు.

మొత్తానికి చాలామంది ముఖ్య‌మంత్రుల్ని చూసిన మంద‌కృష్ణ‌కు.. కేసీఆర్ విష‌యంలో మాత్రం ఆయ‌న‌కు కొత్త అనుభ‌వం అయ్యింద‌నే చెప్పాలి. గ‌త ప‌ద్నాలుగు నెల‌లుగా ఆయ‌న అపాయింట్ మెంట్ కోరినా ముఖ్య‌మంత్రి ఇవ్వ‌క‌పోవ‌టమే దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. కేసీఆరా మ‌జాకానా?