Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఆ ముచ్చ‌ట లేదు

By:  Tupaki Desk   |   27 Aug 2015 5:20 AM GMT
కేసీఆర్‌ కు ఆ ముచ్చ‌ట లేదు
X
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌ తెలంగాణ శాసనసభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ మేర‌కు స‌న్నిహితుల‌తో చ‌ర్చ‌లు చేసేశారు. ఎన్నికల విజయాలతో జవాబులు చెప్పడమనే అలవాటున్న కేసీఆర్‌, ప్రజాదరణ తగ్గిపోతోందనుకున్న ప్రతిసారీ, ఎన్నికల పాచిక విసిరి గెలిచిన‌ట్లే ఈ ద‌ఫా అదే నిర్ణ‌యం తీసుకోనున్నారు. రుణమాఫీ, ఆసరా, సన్న బియ్యం, మిషన్‌ కాకతీయ, ఇరిగేషన్‌, వాటర్‌ గ్రిడ్‌, ఉచిత విద్యుత్తు తదితర పథకాల అండ‌గా ఆయ‌న మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు అంటూ కొన్ని మీడియాల్లో వార్త‌లు రావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

అయితే ఈ వార్త ప్ర‌కారం చూసినా లేదా వాస్త‌వాల‌ను గ‌మ‌నించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇపుడే కాదు క‌దా...అస‌లు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే యోచ‌నే చేయ‌డ‌నే అభిప్రాయాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఎన్నిక‌లు- ఉప ఎన్నిక‌ల్లో కేసీఆర్ నేర్ప‌రి అనే దాంట్లో ఎవ‌రికీ సందేహాం లేదు. అయితే.....ఆయ‌న గ‌తంలో ఉద్య‌మ‌పార్టీకి నాయ‌కుడు. ఇపుడు రాష్ర్టానికి ముఖ్య‌మంత్రి. అప్ప‌టి ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి ఎన్నిక‌ల‌కు స్ప‌ష్ట‌మైన తేడా ఉంటుంది. కేసీఆర్‌ను అపుడు పోరాటానికి నాయ‌కుడిగా చూసి, ఓటువేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు. ఓట్లు వేశారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిపాల‌న ప‌ర‌మైన ఉన్న‌త హోదాలో ఉన్నారు. ఈ ద‌ఫా కేసీఆర్ ఎదుర్కునే ఏ ఎన్నిక అయినా....ఆయ‌న పార్టీ కంటే ఆయ‌న ప్ర‌భుత్వానికే గీటురాయిగా మార‌తాయి. అలాంటి ప‌క్షంలో కేసీఆర్ ఎందుకు ఉప ఎన్నిక‌ల‌కు వెళతారు?

తెలంగాణ‌లో టీడీపీ బ‌ల‌మైన పార్టీగా లేద‌న్న‌ది కాద‌నలేని నిజం. అయితే తిరిగి పుంజుకోద‌గ్గ వాతావ‌ర‌ణం ఆ పార్టీకి లేదు. ఏపీ సీఎం హోదాలోనే బోలెడు బాధ్య‌త‌లు, త‌ల‌నొప్పుల‌తో ఉన్న చంద్ర‌బాబు తెలంగాణ‌లో అధికారం ద‌క్కించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌లేరు. ఒక‌వేళ బాబు అలా నిర్ణ‌యించినా.. సొంత పార్టీకి చెందిన ఏపీ నేత‌లే అడ్డుచెప్ప‌డం ఖాయం. దీంతో పాటు కాంగ్రెస్ ఈ మ‌ధ్య‌కాలంలో తెలంగాణ‌లో పుంజుకున్న‌ది. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ప్ర‌తిబింబించే ప్ర‌తి అవ‌కాశాన్ని వాడుకుంటున్న‌ది. అలాంట‌పుడు ఆ పార్టీ ప్ర‌భావాన్ని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. ఎందుకంటే ఆ పార్టీతో సుదీర్ఘ‌కాలం సంబంధం ఉన్న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎక్కువ‌గానే ఉన్నారు కాబ‌ట్టి.

పైగా కేసీఆర్ ప్రారంభించిన సంక్షేమ ప‌థ‌కాల‌కే కాకుండా తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌తో తెలంగాణ‌లో అన్నివ‌ర్గాలు సంతృప్తిగా లేవు. ఈ విష‌యం కేసీఆర్‌కు కూడా తెలుసు. ఈ అసంతృప్తిని గ‌మ‌నించే పార్టీ కేడ‌ర్‌, అధికారులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే విధంగా మిష‌న్ కాక‌తీయ‌, స్వ‌చ్ఛ తెలంగాణ మొద‌లుకొని గ్రామ‌జ్యోతి వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. అలాంట‌పుడు అన్ని ఓట్లు త‌మ‌కే ప‌డుతాయ‌ని ఎలా భావిస్తారు? కేసీఆర్ ప్ర‌జ‌ల ప‌ల్స్‌ ను ప‌ట్టుకోవ‌డంలో ఆరితేరిన వ్య‌క్తి. అలాంటి వ్య‌క్తి ఇపుడు ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోకుండా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌క‌పోవ‌చ్చు. వీట‌న్నింటికీ మించి ఐదేళ్ల అధికారంలో తొలి ఏడాదికే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు పోయి అధికారంపై గేమ్ ప్లేమ్ చేసే అంత అమాయ‌కుడు కేసీఆర్ కానే కాదు.