Begin typing your search above and press return to search.

కేసీఆర్‌..ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై ఇలా చేశారేంటి?

By:  Tupaki Desk   |   20 Sep 2018 7:11 AM GMT
కేసీఆర్‌..ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై ఇలా చేశారేంటి?
X
మిర్యాల‌గూడ‌లో ప్ర‌ణ‌య్ హ‌త్య‌...ఈ ప‌రిణామం తెలుగు రాష్ర్టాల్లోనే కాదు...దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించింది. ప్రణయ్‌ కులదురహంకార హత్య జరిగి అప్పుడే ఐదు రోజులు గడచిపోయింది. ప్రణయ్‌ హత్యోదంతంలో మారుతీరావు కిరాతకంపై జనం విరుచుకుపడ్డారు. ప్రేమికులపై ఇదే చివరి దాడి కావాలని ఆకాంక్షించారు. అయితే, ప్రణయ్-అమృతల ఉదంతం మర్చిపోకముందే..హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లో జరిగిన సందీప్ - మాధవిపై జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే, దీనిపై పాల‌కప‌క్షం స్పంద‌న లేమీ సైతం అదే రీతిలో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని ప‌లువురు అంటున్నారు.

అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నామని, మేనిఫెస్టోను వందశాతం అమలు చేశామని చెప్తున్న సీఎం కేసీఆర్‌ ప్రణయ్‌ కులదురహంకార హత్యపై నోరు మెదపలేదని ప‌లువురు ఎత్తి చూపుతున్నారు. ఇక ఆయన కుమారుడు - మంత్రి కే తారకరామారావు 'ట్విట్టర్‌' వేదికగా స్పందిస్తూ... నిందితులకు శిక్ష పడుతుందని ఓ పోస్ట్‌ పెట్టారు. అగ్రకుల దురహంకారానికి - ఈ హత్యకు ఉన్న అవినాభావ సంబంధాన్ని స్ఫ్రుశించే కనీస ప్రయత్నం కూడా చేయలేదంటున్నారు. అదేదో సాధారణ విషయం లాగానే కొట్టిపారేశారు. గ‌తంలో వారు ఇలాగే స్పందించార‌నే భావ‌న ఉంది. నేరెళ్ల దళితులపై అక్రమ కేసుల ఘటనలోనూ కేసీఆర్‌ సర్కారు ఇదే తరహాలో వ్యవహరించిందని కొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో బీసీ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మంథని మధుకర్‌ మర్మాంగాలను కోసి దారుణంగా హత్య చేసారు. అప్పుడు కూడా స్పంద‌న‌లేదని మ‌రికొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టీఆర్ ఎస్‌ ప్రభుత్వ నాలుగున్నరేండ్ల పాలనలో కుల దురహం కార హత్యలు పెరుగుతుంటేే కనీసం సమస్య మూలాల్ని వెతికే ప్రయత్నం కూడా లేదని ప‌లువురు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రణయ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు టీఆర్ ఎస్‌ నుంచి స్థానిక ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి - ఎమ్మెల్యే వేముల వీరేశం సహా అనేకమంది నేతలు వచ్చారు. హత్యను ఖండించి - సానుభూతిని వ్యక్తం చేశారే తప్ప పెద్ద‌గా అధికార పార్టీ నుంచి స్పంద‌న రాలేదన్న‌ది కొంద‌రి అభిప్రాయం. బాధితురాలు అమృత వర్షిణి తన తండ్రి - బాబాయిని ఉరితీయాలని డిమాండ్‌ చేసింది. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తమ ప్రేమ పెండ్లి విషయంలో జోక్యం చేసుకొని బెదిరించారనీ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యుదయవాదులు కోరినట్టు 'కులాంతర వివాహాల ప్రత్యేక రక్షణ చట్టం' తెచ్చుంటే కొంతైనా ఈ తరహా హత్యలకు అడ్డుకట్ట పడిఉండేదని కొంద‌రు ప్ర‌తిపాదిస్తున్నారు. ఈ హ‌త్య‌ల‌కు తోడుగా ఇటీవ‌ల జ‌రిగిన కొండ‌గ‌ట్టు రోడ్డు ప్ర‌మాదం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించినా..సీఎం కేసీఆర్ బాధితుల‌ను క‌నీసం ప‌రామ‌ర్శించ‌లేద‌ని...రాష్ట్రంలో ఏం జ‌రుగుతున్నా ప‌ట్ట‌ని వ్య‌క్తి పాల‌కుడు అనిపించుకుంటారా అంటూ ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌లువురు భ‌గ్గుమంటున్నారు.