పిల్లల ఉసురు తగులుద్దని తిట్టిపోస్తున్నారు కేసీఆర్?

Tue Apr 23 2019 10:52:59 GMT+0530 (IST)

మీరే ఏమైనా అనుకోండి. ఎన్ని అయినా అనుకోండి. నాకు నచ్చినప్పుడు.. నేనే కోరుకున్నప్పుడు రియాక్ట్ అవుతా అన్న ధోరణి మంచిదేనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ ప్రజానీకంలో అసంతృప్తిని.. ఆగ్రహాన్ని అంతకంతకూ పెంచేలా చేస్తోంది. ఏదైనా పెద్ద ఉదంతం వచ్చినప్పుడు.. స్పందించాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం.. తనకేం సంబంధం లేనట్లుగా వ్యవహరించటం మంచిది కాదంటున్నారు.దాదాపు పది లక్షల మందికి పైగా విద్యార్థులు.. వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ఇంటర్ పరీక్షా ఫలితాల ఎపిసోడ్ కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించింది లేదు. ముగ్గురు సభ్యుల బృందంతో కమిటీ వేసి.. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పిచేతులు దులుపుకున్నారే కానీ.. జరిగిన తప్పును ఎలా సరిదిద్దాలన్న విషయం మీద ప్రభుత్వం నుంచి భరోసా కలిగించే మాట ఒక్కటి కూడా రాలేదు.

ఇంటర్ బోర్డు వైఫల్యంపై మండిపడుతున్న విద్యార్థులు.. తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం.. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఇంటర్ బోర్డును ముట్టడించేందుకు పలు విద్యార్థి సంఘాలు.. తల్లిదండ్రులు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మొహరించటంతో ముట్టడి సక్సెక్ కాకున్నా.. తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కడుపు మండిన తల్లిదండ్రులు.. ఆవేదనతో విద్యార్థులు ప్రభుత్వాన్ని.. అధికారుల్ని తిట్టిపోయటం కనిపించింది.

పిల్లల ఉసురు పోసుకోవటం మంచిది కాదంటూ పలువురు తల్లిదండ్రులు శాపనార్థాలు పెట్టటం గమనార్హం. ఆందోళనలు నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. ఇంత భారీగా నిరసనలు చోటు చేసుకుంటున్న వేళ.. జరిగిన తప్పులను కరెక్ట్ చేసే పనిలో ప్రభుత్వం ఉందన్న ఉపశమనపు ప్రకటన ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి రాకపోవటం సరికాదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. లక్షలాది మందికి సంబంధించిన విషయంలోనూ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తీరు ఏ మాత్రం సరికాదంటున్నారు. పిల్లల ఉసురు ప్రభుత్వానికి మంచిది కాదన్న విషయం కేసీఆర్ కు మాత్రం తెలీదా?  మరెందుకు ఆయన మౌనంగా ఉన్నట్లు..?