జయంతులు.. వర్థంతులకు కేసీఆర్ చెల్లుచీటి?

Mon Apr 16 2018 11:39:25 GMT+0530 (IST)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా డిఫరెంట్. ఆయనేం చేసినా అందరికంటే భిన్నంగా చేస్తుంటారు. విమర్శల్ని పట్టించుకోవటం ఆయన నైజం కాదు. ఈ విషయంలో మాత్రం ప్రధాని మోడీకి కాస్తంత దగ్గరగా వస్తారని చెప్పాలి. ఏం జరిగినా.. ఎవరెంతగా మాట్లాడినా.. అసలేం జరగనట్లుగా వ్యవహరించటంలో మోడీ మొనగాడైతే.. ఆ విషయంలో కేసీఆర్ సైతం ఏ మాత్రం తీసిపోలేదని చెప్పక తప్పదు.సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం ఉంటుంది. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అందుకు భిన్నం. ఆయన కొన్ని కార్యక్రమాల్లోనే పాల్గొంటారు. సాధారణంగా ప్రముఖుల జయంతులు.. వర్థంతుల కార్యక్రమాలకు హాజరు కావటం.. వారిని స్మరించుకోవటం ప్రతి రాష్ట్రంలోనూ చేస్తారు. కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు.

కావాలంటే కాస్త గుర్తు తెచ్చుకోండి. ఈ మధ్యన జరిగిన జగ్జీవన్ రాం.. జ్యోతిరావు పూలే.. అంబేడ్కర్ జయంతులకు సీఎం కేసీఆర్ కనిపించటం ఉండదు. అంతేనా.. తమ ప్రభుత్వంలో 125 అడుగుల అమరవీరుల స్తూపాన్ని.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకూ ఆ హామీల్ని ఎంతవరకూ పూర్తి చేశారన్నది తెలిసిందే.

ఇంతకీ ప్రముఖుల జయంతులు.. వర్థంతులకు కేసీఆర్ హాజరు కాకుండా ఏం చేస్తారన్న ప్రశ్న పలువురిని తొలిచివేస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు ఏ మాత్రం మిస్ కాని కార్యక్రమాల్ని కేసీఆర్ మాత్రం లైట్ తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆ విషయాల్ని ప్రస్తావించే విషయంలో మీడియా సైతం ఎందుకో పట్టనట్లుగా ఉండటం కనిపిస్తుంది. ప్రముఖుల్ని స్మరించుకొని మాటలు చెప్పే కేసీఆర్.. అలాంటి వారికి సంబంధించిన రోజుల్లో కనీసం ఇంట్లో నుంచి బయటకు రావటానికి ఎందుకు వెనకాడుతున్నారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.