Begin typing your search above and press return to search.

గవర్నర్ తో 3 గంటలు కేసీఆర్ ఏం మాట్లాడారు?

By:  Tupaki Desk   |   5 Aug 2015 4:49 AM GMT
గవర్నర్ తో 3 గంటలు కేసీఆర్ ఏం మాట్లాడారు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ ను కలవటం మామూలు. మర్యాదపూర్వకంగా మాట్లాడటంతోపాటు.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తరచూ భేటీ కావటం కొత్తవిషయం ఏమీ కాదు. కానీ.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి.. గవర్నర్ భేటీ దాదాపు మూడు గంటలకు పైగా సాగటం ఆసక్తికరంగా మారింది.

ఈ భేటీలో ఏమేం మాట్లాడి ఉంటారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ సర్కారు బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టిందన్న వాదన వినిపిస్తోంది. ఎవరికో ఏదో చెప్పొచ్చు కానీ.. రాష్ట్ర విభజన ముందు నుంచి హైదరాబాద్ లోనే ఉన్న గవర్నర్ నరసింహన్ కు ఎవరేం చేస్తున్నారో కొత్త ఫిర్యాదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? అన్నది ఒక విషయమైతే.. మరీ.. అంత నాటకీయ మాటలు గవర్నర్.. ముఖ్యమంత్రుల మధ్య సాగుతాయా? అన్నది మరో ప్రశ్న.

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ప్రముఖుల మధ్య జరిగే సంభాషణల్లో పెద్ద నాటకీయత కనిపించదు. అధికారికంగా జరిగే సమావేశాల్లో తమకు కావాల్సిన అంశాల విషయాన్ని ప్రస్తావించటం ఉంటుందే తప్పించి.. పత్రికల్లో వచ్చినంత కామెడీగా వారి మధ్య సంబాషణలు సాగవు.

కాస్తంత చురుకులు.. మరికాస్త.. మర్యాదతో మాటలు సాగుతాయి. ఇక.. వన్ టు వన్ గా భేటీ అయిన సందర్భంలో తాను చెప్పాలనుకున్నవి.. తాము కోరుకుంటున్న వాటి గురించి కాస్తంత ఓపెన్ గానే మాట్లాడుకునే పరిస్థితి.

తాజాగా సాగిన భేటీలో ఏపీ కడుతున్న ప్రాజెక్టుల గురించి కేసీఆర్ ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తాము నిర్మిస్తున్న పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు లేవని చెబుతున్న ఏపీ సర్కారుపై తెలంగాణ సర్కారు గుర్రుగా ఉంది. అందుకే వారు ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుకు చూపిస్తూ.. దానికి అనుమతులు లేవన్న వాదనను తెరపైకి తీసుకొచ్చి.. గవర్నర్ దృష్టికి తెచ్చినట్లుగా చెబుతున్నారు.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. ఉస్మానియా ఆసుపత్రి భవనం కూల్చివేత.. ప్రత్యేక హైకోర్టుకు సంబంధించి తమ వాదనను గవర్నర్ దగ్గర కేసీఆర్ వినిపించినట్లు చెబుతున్నారు. ఇదంతా అధికారికం అయితే.. అనధికారికంగా ట్యాపింగ్ గురించి కొన్ని మాటలు జరిగి ఉండొచ్చని.. త్వరలో ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో.. కేంద్రం మూడ్ ను కాస్తంత వాకబు చేయాలని గవర్నర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. గవర్నర్.. ముఖ్యమంత్రి మధ్య మూడు గంటల పాటు సాగిన భేటీ కాస్తంత కీలకమైనదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.