హాట్ టాపిక్ గా మారిన కేసీఆర్ మౌనం!

Thu Mar 14 2019 09:58:59 GMT+0530 (IST)

మాట్లాడటం అందరూ చేసే పని. అవసరానికి మాత్రమే మాట్లాడటం.. అది కూడా ఎప్పుడు ఎలా మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉంటుందన్న విషయంపై స్పష్టతతో టైమ్లీగా మాట్లాడటం.. ముఖం పగిలిపోయేలా పంచ్ లు వేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికి తెలీదేమో.మిగిలిన రాజకీయ నేతలకు భిన్నంగా కేసీఆర్ తీరు ఉంటుందని చెప్పాలి. అందరి మాదిరి అదే పనిగా మాట్లాడటం.. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. హైరానా పడుతూ నిత్యం ఏదో ఒకటి మాట్లాడటం.. తమ ప్రత్యర్థులను ఉద్దేశించి డైలీ బేసిస్ లో విమర్శలు.. ఆరోపణలు చేయటం లాంటివి కేసీఆర్ కు బొత్తిగా ఇష్టం ఉండదు. ప్రత్యర్థికి ఇవ్వాల్సిన అవకాశం ఇచ్చి.. ఎదురుదాడి షురూ చేస్తుంటారు.

ఒక్కసారి ఎదురుదాడి మొదలుపెడితే చాలు.. వెనక్కి తగ్గని తీరు కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఈ మధ్యనే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోఈ విషయం స్పష్టంగా అర్థమైంది. తన మాటలతో తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాన్ని రగిల్చి.. ఎన్నికల ఫలితాల్ని తనకు అనుకూలంగా మార్చుకున్న వైనం.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నాలుగు రోజులు దాటి పోయినా.. నేటికి కేసీఆర్ నోటి నుంచి ఒక్క మాట వచ్చింది. లేదు. ఆ మాటకు వస్తే.. ఎన్నికల సభల్లో పాల్గొన్నది లేదు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు.. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. నోరు తెరిస్తే చాలు.. ఆసక్తికర వ్యాఖ్యలతో పాటు.. సీన్ మొత్తాన్ని ప్రభావితం చేసేలా ఉండే కేసీఆర్.. అందుకు భిన్నంగా మౌనంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గడిచిన కొద్ది రోజులుగా అదే పనిగా కేసీఆర్ ను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఏపీలో పోటీ తనకూ.. కేసీఆర్ కు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. బాబు తీరుపై కేసీఆర్ నోరు విప్పితే కానీ అసలు కథ మొదలుకాదన్న మాట పలువురి నోట వినిపిస్తుంటుంది. బాబును మాటలతో ఆట ఆడుకోవటం కేసీఆర్‌కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని.. అలాంటి కేసీఆర్ నోరు విప్పితే కానీ ఎన్నికల వేడి మరింత పెరగదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. తన మాటలతోనే కాదు.. మౌనంతోనూ అందరి దృష్టి తన మీద పడేలా చేసుకోవటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో?