Begin typing your search above and press return to search.

కేసీఆర్ మ‌ళ్లీ విశ్వ‌రూపం చూపనున్నార‌ట‌

By:  Tupaki Desk   |   17 Oct 2017 11:38 AM GMT
కేసీఆర్ మ‌ళ్లీ విశ్వ‌రూపం చూపనున్నార‌ట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌లి కాలంలో మీడియాతో, ఇతర పార్టీల నేత‌ల‌తో సంభాషించ‌డం త‌గ్గిపోయిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రితో త‌ప్ప పార్టీ నేత‌ల‌తో మాట్లాడ‌టం కూడా దాదాపుగా త‌గ్గిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే కేసీఆర్ మాట్లాడ‌టం మొద‌లుపెడితే....ఆ వాగ్దాటి అలా సాగిపోతుంద‌నే సంగ‌తి తెలిసిందే. అందులోనూ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో అయితే...ఇక చెప్ప‌న‌క్క‌ర్లేదు క‌దా! మ‌రోవారంలో అదే జ‌ర‌గ‌నుంది.  ప్రగతి భవన్‌ లో ఇవాళ సీఎం కేసీఆర్ మంత్రులు - ప్రజాప్రతినిధులు - ఉన్నతాధికారులతో సమావేశమై...శాసనసభ సమావేశాలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని సీఎం కేసీఆర్ మంత్రులు - ప్రజాప్రతినిధులకు నిర్దేశించారు. సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశంపై జవాబు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌పై అవ‌గాహ‌న కలిగేలా... ప్రజలకు సంబంధించి అన్ని విషయాలను అసెంబ్లీ ద్వారా వివరించాలని..ఇందుకోసం మంత్రులంతా సిద్దం కావాలని సీఎం కేసీఆర్  సూచించారు. ``ప్రజల కోసం దేశంలో మరెక్కడా అమలు చేయని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వాటి గురించి వివరించాలి. సభ్యుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు విలువైన సూచనలు స్వీకరించాలి. అంతిమంగా అసెంబ్లీ నుంచి ప్రజలకు కావాల్సిన సమాచారం పోవాలి`` అన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నిర్వహించడానికి మనకేం అభ్యంతరం లేదని సీఎం తెలిపారు. త‌ద్వారా త‌న మార్కు విశ్వ‌రూపం చూపేందుకు సిద్ధ‌మైన‌ట్లు కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పేశార‌ని అంటున్నారు.

మాతృభాష పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. ``ఇంటర్మీడియట్ వరకు కచ్చితంగా తెలుగు సబ్జెక్టుగా ఉండాలనే నిబంధనల వల్ల మాతృభాష పరిరక్షణతోపాటు అనేక మంది తెలుగు పండిటక్లు ఉద్యోగావకాశం లభిస్తుంది. ప్రభుత్వం స్థాపించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలి. హైదరాబాద్‌ లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలపై సభలో చర్చ జరగాలి` అని సీఎం సూచించారు. ఈ సమావేశాలు చాలా ముఖ్యమైనవిగా భావించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ``రిజర్వేషన్ల పెంపుపై మరోసారి కేంద్రాన్ని కోరాలి. సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు - ఉపాధి హామీ పనులను వ్యవసాయంతో అనుసంధానం చేయడం - తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన అంశాలపై మరోసారి కేంద్రాన్ని అసెంబ్లీ గట్టిగా కోరాల్సిన అవసరముంది. మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఒత్తిడి పెంచాలి`` అని సీఎం అభిప్రాయపడ్డారు. కాగా, ఈ నెల 27 నుంచి శాసనసభ - మండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.