నిరంకుశత్వంలో కేసీఆర్ కు చంద్రబాబే స్ఫూర్తి

Thu Sep 14 2017 05:00:01 GMT+0530 (IST)

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా పథకాల విషయంలో ఒకరిని చూసి ఒకరు అదే తీరుగా స్పందిస్తూ.. అదే తీరుగా పాలనను నడిపిస్తూ వస్తున్న వైనం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే.. పాలనను నిరంకుశ శైలికి మార్చేసే నిర్ణయాల్లో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తిగా నిలుస్తున్నారేమో అని జనం అనుకుంటున్నారు. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ ఏపీలో నియోజకవర్గాలు మండలాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధి దారుల్ని ఎంపిక చేసేందుకు ఏర్పాటుచేసిన గ్రామ కమిటీల తరహాలోనే.. ఇప్పుడు తెలంగాణలో రైతు సమితులు ఏర్పాటు అవుతున్నాయి. రెండింటికీ కూడా ప్రజాప్రతినిధుల అధికారాల్ని సైడ్ లైన్ చేసే స్థాయిలో అధికారాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ రైతు సమితుల ఏర్పాటు వ్యవహారం మీద ప్రతిపక్షాలు మొత్తం గగ్గోలు పెడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు ఇదే చర్యలకు పాల్పడ్డారు. గతంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ గ్రామ కమిటీలను సహజంగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులు - పదవుల్లేకుండా ఉన్న కార్యకర్తలతో నింపేశారు. తెదేపా ఎమ్మెల్యేలు ఉన్నచోట అంతా వారి మాటే వేదవాక్కుగా సాగింది గానీ.. వైకాపా ఎమ్మెల్యేలు ఉన్న చోట.. ఎమ్మెల్యేను కూడా పట్టించుకోకుండా.. ఈ గ్రామకమిటీ ల ఆధ్వర్యంలోనే అన్ని ఎంపికలు జరిగేవి. ఇదంతా చాలా గందరగోళానికి దారి తీసింది.

ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రారంభిస్తున్న రైతు సమితులు కూడా ఇదే తరహాలో కనిపిస్తున్నాయి. పైగా కేసీఆర్ వీటికి చట్టబద్ధత కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రైతు సమన్వయ సమితులకు రాష్ట వ్యాప్తంగా ఒక అధ్యక్షుడిని కూడా నియమించి.. కేబినెట్ హోదా కల్పించబోతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఫిరాయించి తమ పార్టీలోకి రావడానికి కేబినెట్ హోదా ను హామీగా పొందిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఈ పదవి దక్కబోతోంది. ఏతా వతా.. రైతు సమన్వయ సమితులు ప్రజాప్రతినిధుల వ్యవస్థకు సమాంతర వ్యవస్థలాగా నడుస్తాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే గ్రామ - మండల స్థాయుల్లో ఎమ్మెల్యేలు చెప్పిన వారితోనే.. సమితులను నింపేస్తున్నారనే విమర్శలు కూడా పుష్కలంగా వస్తున్నాయి.

మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే.. ప్రజాస్వామిక ప్రభుత్వంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం పరిపాలన వ్యవస్థను నిరంకుశత్వం రూపంలోకి మార్చేసే ప్రక్రియ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కేసీఆర్ లాంటి వారికి స్ఫూర్తి ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.