Begin typing your search above and press return to search.

కొత్త అల‌వాటును ఫాలో అవుతున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   9 Feb 2019 5:36 AM GMT
కొత్త అల‌వాటును ఫాలో అవుతున్న కేసీఆర్‌
X
మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో ఉండే ఒక గుణాన్ని ప‌లువురు చెబుతుంటారు. మ‌నిషి భోళాగా ఉంటార‌ని.. న‌మ్మిన వారి ద‌గ్గ‌ర ప్రైవేటు విష‌యాల్ని సైతం మాట్లాడుతుంటార‌ని.. త‌న ఆలోచ‌న‌ల్ని ఆవిష్క‌రిస్తుంటార‌న్న పేరుంది. వివిధ అంశాల‌పై చ‌ర్చ‌ల కోసం ప‌లువురిని క‌లుస్తుంటారు. వారితోనూ కొన్ని విష‌యాల్ని.. తాను చేయాల‌నుకుంటున్న అంశాల్ని ప్ర‌స్తావిస్తుంటారు.

ఇక‌.. త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర అయితే ఆయ‌న ఎప్పుడూ ఓపెన్ గానే ఉంటార‌ని చెబుతారు. కొన్ని కీల‌క నిర్ణ‌యాల‌తో పాటు.. వ్యూహాల్ని ఆయ‌న రివీల్ చేయ‌రు. అయితే.. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో మాత్రం దాదాపుగా అన్ని విష‌యాల్ని త‌న స‌న్నిహితుల‌తో చ‌ర్చిస్తూ ఉంటార‌ని చెబుతారు.

అలాంటి కేసీఆర్ లో ఇప్పుడు మార్పు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా రెండోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత నుంచి ఆయ‌న‌లో మార్పు స్ప‌ష్టంగా తెలుస్తోంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. గ‌తానికి భిన్నంగా ఆయ‌న తీరు ఉందంటున్నారు. చూసేందుకు మామూలుగా మాట్లాడుతున్నా.. గ‌తంలో మాదిరి విష‌యాల్ని చెప్పేందుకు ఆయ‌న ఇంట్ర‌స్ట్ చూపించ‌టం లేదంటున్నారు.

ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ నిర్ణ‌యాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటున్నాయి. ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారం కావొచ్చు.. మంత్రి వ‌ర్గ ఏర్పాటుతో పాటు.. చాలా అంశాల్లో ఆయ‌న త‌న మ‌న‌సులోని ఆలోచ‌న‌ల్ని అస్స‌లు బ‌య‌ట‌పెట్ట‌టం లేదంటున్నారు.

గ‌తంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా విష‌యాల్ని ర‌హ‌స్యంగా ఉంచుతున్నార‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది. సీనియ‌ర్ పాత్రికేయుల‌తో.. కీల‌క అధికారుల‌తో పాటు.. త‌న‌కు స‌న్నిహితంగా ఉండే నేత‌ల‌తోనూ తానేం చేయాల‌నుకుంటున్న విష‌యాన్ని ఆయ‌న మాట మాత్రంగా కూడా చెప్ప‌టం లేదంటున్నారు. ఈ అల‌వాటు కేసీఆర్‌ కు కొత్త‌గా వ‌చ్చింద‌ని.. పాత కేసీఆర్‌ కు.. ఇప్పుడున్న‌కేసీఆర్‌ కు మ‌ధ్య తేడా కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ట‌. ఇంత‌కీ.. ఇంత‌లా ఎందుకు మారిన‌ట్లు కేసీఆర్ జీ?