Begin typing your search above and press return to search.

ఈ గెలుపుతో...కేసీఆర్ క‌ల నెరవేరింది

By:  Tupaki Desk   |   23 March 2018 6:13 PM GMT
ఈ గెలుపుతో...కేసీఆర్ క‌ల నెరవేరింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క‌ల నెర‌వేరింది. ఆయ‌న అనుకున్న‌దే జ‌రిగింది. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. రాష్ట్రంలో జరిగిన మూడు రాజ్యసభ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య, బండ ప్రకాశ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఓడిపోయారు! ఆయనకు 10 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం 108 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులు బండ ప్రకాశ్‌కు 33 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్‌కు 32 ఓట్లు, జోగినపల్లి సంతోష్ కుమార్‌కు 32 ఓట్లు పోలయ్యాయి.

ఈ గెలుపుతో గులాబీద‌ళ‌ప‌తి కేసీఆర్ తాను అనుకున్న‌ది సాధించార‌ని అంటున్నారు. రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వం విష‌యంలో జోగిన‌పల్లి పేరు తెర‌మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు అంద‌రూ ఖ‌రారు అవుతుంద‌నే అనుకున్నారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేశారు. సంతోష్‌కు రాజ్య‌స‌భ సీటు కేటాయించ‌డం అంటే కుటుంబ రాజకీయాల‌కు తెర‌తీయ‌డ‌మే అని వ్యాఖ్యానించారు. ఇంత‌టితో ఆగ‌కుండా..కేసీఆర్‌ను సంతోష్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నార‌ని కూడా విమ‌ర్శించారు. ఇంటిలోని మ‌నిషికి కాకుండా...అమ‌ర‌వీరుల‌కు చాన్స్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అయితే ఇలాంటి వాటిని కేసీఆర్ లైట్ తీసుకున్నారు. సంతోష్‌కే బ‌రిలో దిగే అవ‌కాశం ఇచ్చి ఆయ‌న్ను గెలిపించుకున్నారు.

కాగా, జోగిన‌ప‌ల్లి సంతోష్‌రావు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ద‌గ్గ‌ర పార్టీ, ప్ర‌భుత్వ ప‌ర‌మైన నిర్ణ‌యాలను `ప్ర‌భావితం` చేయ‌డానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొర‌కాలంటే సంప్ర‌దించాల్సింది జోగిన‌పల్లి సంతోష్ రావునే. అంత ప‌ట్టు సీఎం ద‌గ్గ‌ర ఉంద‌న్నమాట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న్ను కేసీఆర్ కుటుంబం నుంచి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి తీసుకురానున్న‌ట్లు కొద్దికాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ ఎందుకు కేసీఆర్ అంత ప్రాధాన్యం అంటే...ఈయన స్వయానా కేసీఆర్‌ మరదలి కొడుకు. ఉద్య‌మ‌కాలం నుంచి ఈనాటికి కేసీఆర్ వెంట ఉన్న అతి కొద్దిమందిలో ఆయ‌న ఒక‌రు.