కాంగ్రెస్ ఇలా ఉంటే..కేసీఆర్ కు ఇంకేం కావాలి?

Sat Feb 16 2019 07:00:01 GMT+0530 (IST)

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో....ఐక్యంగా ఉండి పార్టీని ముందుకు నడిపించి...బలమైన ప్రత్యర్థి అయిన టీఆర్ ఎస్ ను ఓడించాల్సింది పోయి...ప్రతిపక్ష కాంగ్రెస్ కొత్త పంచాయతీలతో పరువు బజారు పాలు చేసుకుంటోందనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ముహుర్తం సమీపిస్తున్న నేపథ్యంలో...తెలంగాణ కాంగ్రెస్ లో లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది. రిజర్వుడ్ ఎంపీ స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో లోకల్-నాన్ లోకల్ ఫైట్ ప్రారంభమైంది. లోక్ సభ సీటు దక్కించుకునేందుకు నేతలు లోకల్-నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకువస్తున్నారు. నాన్ లోకల్ గో బ్యాక్ అంటూ నినదిస్తూ...పార్టీలోని కుంపట్లను బయటపెట్టుకుంటున్నారు.పార్లమెంటు నియోజకవర్గాల ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ సమయంలోనే...కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అంతర్గత కుంపట్లు తలపోటును కలిగిస్తున్నాయని చర్చ జరుగుతోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలుండగా.. ఇందులో ఐదు రిజర్వుడ్ లోక్ సభ సీట్లు ఉన్నాయి.  ఆదిలాబాద్ - మహబూబాబాద్ ఎస్టీలకు రిజర్వు కాగా... నాగర్ కర్నూల్ - పెద్దపల్లి - వరంగల్ సీట్లు ఎస్సీలకు  రిజర్వు అయ్యాయి. వీటిలో పెద్దపల్లి - నాగర్ కర్నూల్ స్థానాలకు పోటీ ఎక్కువగా ఉంది. ఒక్కో సీటుకు 15 మందికి పైగా ఆశావహులు పోటీ పడుతున్నారు. రిజర్వుడ్ స్థానాల్లో ఏదో ఒక సీటు ఇవ్వకపోతారా.. అన్న ధీమాతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో లోక్‌ల్ - నాన్ లోక్ ఫీలింగ్ తెరపైకి వచ్చింది.నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వుడ్ లోక్ సభ స్థానంలో లోకల్ లొల్లి ఎక్కువగా ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

అధికార టీఆర్ ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానానికి టీఆర్ ఎస్ అభ్యర్థిగా స్థానికుడైన మాజీ మంత్రి రాములుకు సీటు దాదాపు ఖరారైంది. కాగా - కాంగ్రెస్ నుంచి  మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ - మాదిగ ఉద్యమ నేత సతీష్ మాదిగ - మల్లు రవి - నంది ఎల్లయ్య పోటీ పడుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ - మాదిగ ఉద్యమ నేత సతీష్ మాదిగ స్థానికులు కాగా - మల్లు రవి - నంది ఎల్లయ్య స్థానికేతరులు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మాల సామాజిక వర్గం ఓటర్ల  కంటే మాదిగ సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్థానికులైన సంపత్ కుమార్ - సతీష్ మాదిగ సీటు కోసం పోటీ పడుతున్నారు. అధికార టీఆర్ ఎస్ అభ్యర్థి రాములు మాదిగ సామాజిక వర్గం నాయకుడు కావడంతో..కాంగ్రెస్‌లో కూడా స్థానికుడైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికే సీటు ఇవ్వాలన్న డిమాండ్ తో కేడర్ రోడ్డెక్కింది. దీంతో టీపీసీసీలో కలవరం మొదలైంది. గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న నాగర్ కర్నూల్ లోక్ సభ సీటు కోసం జరుగుతున్న లోకల్ - నాన్ లోకల్ లొల్లి విజయంపై ప్రభావం చూపుతుందోమోనన్న భయం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని వేధిస్తోంది.