Begin typing your search above and press return to search.

మేనల్లుడికి భారీ టాస్క్ ఇచ్చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   11 Sep 2019 5:16 AM GMT
మేనల్లుడికి భారీ టాస్క్ ఇచ్చేసిన కేసీఆర్
X
ఉద్యమం నాటి నుంచి తనతోనే ఉన్న మేనల్లుడికి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా లెక్కల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సరి చేసినట్లుగా చెబుతారు. తన రాజకీయ వారసుడైన కేటీఆర్ కు భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్లాన్ వర్క్ వుట్ కాలేదంటారు. కొద్ది నెలలుగా హరీశ్ ను పక్కన పెట్టేసి.. కొడుక్కి ప్రయారిటీ ఇవ్వాలని భావించినా.. పరిస్థితులు అందుకు తగ్గట్లు లేకపోవటంతో.. చివరకు హరీశ్ కు మంత్రి పదవి కట్టబెట్టక తప్పలేదంటారు.

తాను ఆశించినంతగా కేటీఆర్ ఇమేజ్ ప్రజల్లో పెరగకపోవటం.. తాను పక్కన పెట్టేయటం కారణంగా హరీశ్ కు ప్రజల్లో సానుభూతి అంతకంతకూ పెరిగిపోతున్న విషయాన్ని గుర్తించే..మంత్రి పదవిని కట్టబెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మంత్రి పదవిని కొత్తగా ఇచ్చిన ఆరుగురిలో ఎవరికి లేనట్లు.. హరీశ్ కు గులాబీ బాస్ కొత్త టాస్క్ ను ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ కు ఎదురైన చేదు అనుభవం మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు వీలుగా కేసీఆర్ పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలతో పాటు.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో జరిగే హుజుర్ నగర్ ఉప ఎన్నిక బాధ్యతను హరీశ్ కు కేసీఆర్ అప్పజెప్పారంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో.. త్వరలో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాన్ని కారు ఖాతాలో వేయటం ద్వారా..తెలంగాణలో తమకు తిరుగులేదన్న సంకేతాన్ని పంపాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

ఇలాంటి భారీ టాస్క్ లు విజయవంతంగా పూర్తి చేయటంలో దిట్ట అయిన హరీశ్ కు ఈ బాధ్యతను అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది. గత నవంబరులోజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం స్వల్ప వ్యత్యాసంతో టీఆర్ఎస్ చేజారిన వైనం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో హుజూర్ నగర్ సీటు ఎట్టి పరిస్థితుల్లో గులాబీ వశం కావాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్.. ఆ బాధ్యతను హరీశ్ కు అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు.