Begin typing your search above and press return to search.

గెలిచే ధీమాలోనూ ఈ రిక్వెస్ట్ లు ఏంది కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   22 Oct 2018 5:29 AM GMT
గెలిచే ధీమాలోనూ ఈ రిక్వెస్ట్ లు ఏంది కేసీఆర్‌?
X
నేను చెప్పిన‌ట్లు చేయండి. మీ గెలుపు బాధ్య‌త నేను తీసుకుంటా.. అంటూ ముంద‌స్తుకు వెళ్ల‌టానికి ముందు గులాబీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ అన్న మాట‌. పార్టీ అభ్య‌ర్థుల విజ‌యం త‌న బాధ్య‌త‌గా చెప్పే కేసీఆర్‌.. త‌న వ్య‌క్తిగ‌త గెలుపును మాత్రం మ‌రో టీఆర్ ఎస్ నేత మీద పెట్ట‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా పార్టీ అభ్య‌ర్థుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశం సంద‌ర్భంగా ఒక ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. తాను బ‌రిలో నిలిచిన గ‌జ్వేల్ ప్ర‌చార బాధ్య‌త‌ల్ని మెద‌క్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డికి అప్ప‌జెప్పారు. గ‌జ్వేల్ లో త‌న‌ను గెలిపించే బాధ్య‌త తీసుకోవాల‌ని కేసీఆర్ స్వ‌యంగా కోరారు.

గ‌త ఎన్నిక‌ల్లో త‌న విజ‌యం కోసం కొత్త ప్ర‌భాక‌ర్ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని.. అయినా త‌క్కువ మెజార్టీ వ‌చ్చింద‌ని.. ఈసారి మాత్రం అలా జ‌ర‌గ‌కుండా మంచి మెజార్టీ తీసుకురావాల‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ లో త‌న విజ‌యంలో కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి పాత్ర కీల‌క‌మ‌ని.. ఆ టైంలో బాగా క‌ష్ట‌ప‌డ్డావంటూ కితాబు ఇచ్చిన కేసీఆర్‌.. గ‌తంలో మాదిరి ఈసారి త‌క్కువ మెజార్టీ రావ‌టానికి వీల్లేద‌ని.. పూర్తి స‌మ‌యాన్ని కేటాయించి త‌న‌ను గెలిపించాల‌ని కోర‌టం విశేషం.

మ‌రి.. కేసీఆర్ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎంత‌మేర తీరుస్తారో చూడాలి. ఓవైపు పార్టీ మేనిఫెస్టో ముసాయిదాను విడుద‌ల చేయ‌టానికి ముందు ఉన్న విజ‌య‌వ‌కాశాలు.. పార్టీ మేనిపెస్టో విడుద‌ల చేశాక మ‌రింత పెరిగాయ‌ని.. వంద సీట్లు ప‌క్కా అని చెప్పిన కేసీఆర్‌.. గెలుపు అవ‌కాశాలు 75 శాతం పైనే ఉన్న‌ట్లు వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం.

పార్టీ అభ్య‌ర్థులంతా బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతో గెల‌వ‌నున్నార‌ని.. ఆ విష‌యం పోలీస్ నిఘా విబాగం.. ప్రైవేటు సంస్థ‌లు వేర్వేరుగా చేసిన స‌ర్వేల్లో వెల్ల‌డైన‌ట్లుగా కేసీఆర్ చెప్పారు. ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ దేశంలోనే అత్య‌ధిక ఓట్లు పొందే పార్టీగా చ‌రిత్ర సృష్టించ‌నుంద‌న్న జోస్యం చెప్పారు.

స‌ర్వే ఫ‌లితాల ఆధారంగా కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు.. కాంగ్రెస్ అభ్య‌ర్థులు పొందే ఓట్ల శాతాన్ని చ‌దివి వినిపించిన కేసీఆర్‌.. టీఆర్ ఎస్ విజ‌యం ఏ స్థాయిలో ఉంటుంద‌న్న క‌ల‌ర్ సినిమాను పార్టీ అభ్య‌ర్థుల‌కు చూపించిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తం 119 సీట్ల‌లో స‌ర్వే చేసినా ప్ర‌స్తుతానికి 30 శాతం నియోజ‌క‌వ‌ర్గాల వివ‌రాలే వ‌చ్చాయ‌ని.. రానున్న రెండు రోజుల్లో మిగిలిన 70 శాతం సీట్ల వివ‌రాలు వ‌స్తాయ‌ని చెప్పారు.

ఉత్త‌ర తెలంగాణ‌లోని 54 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ ఎస్ కు వ‌చ్చే ఓట్లు 60 శాతం కంటే ఎక్కువ‌ని.. ద‌క్షిణ తెలంగాణ‌లోని గ‌రిష్ఠ స్థానాల్లో 50 వాతానికి మించి ఓట్లు ప‌డ‌నున్న‌ట్లు కేసీఆర్ చెబుతున్నారు. పార్టీ అభ్య‌ర్థులంతా బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతో గెల‌వ‌టం ఖాయ‌మ‌న్న మాట‌ను చెప్పిన కేసీఆర్‌.. అదే నోటితో తాను పోటీ చేస్తున్న గ‌జ్వేల్ లో విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డాల‌ని.. భారీ మెజార్టీ వ‌చ్చేలా చేయాల‌ని ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిని కోర‌టం చూస్తే.. కేసీఆర్ మాట‌ల్లో వైరుధ్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌క మాన‌దు.