Begin typing your search above and press return to search.

డౌట్లు అక్క‌ర్లేదు.. స‌చివాల‌యం వెళ్ల‌న‌ని చెప్పిన‌ట్లే!

By:  Tupaki Desk   |   12 Dec 2018 5:29 AM GMT
డౌట్లు అక్క‌ర్లేదు.. స‌చివాల‌యం వెళ్ల‌న‌ని చెప్పిన‌ట్లే!
X
కొంద‌రు అధినేత‌ల తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. త‌మ మీద ప‌డే మ‌చ్చ‌ల్ని స‌మ‌యం చూసుకొని మ‌రీ చెరిపేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. ఆ విమ‌ర్శ‌ల్ని మ‌ళ్లీ ప్ర‌స్తావించ‌ని రీతిలో వారు రియాక్ట్ అవుతుంటారు. ర‌క్త‌చ‌రిత్ర సినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌ధారిగా క‌నిపించే పాత్ర చెప్పిన‌ట్లు.. టాపిక్ ఈజ్ ఓవ‌ర్ అని తేల్చేస్తుంటారు. తాజాగా కేసీఆర్ సైతం అదే తీరును ప్ర‌ద‌ర్శించారు.

దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌చివాల‌యానికి వెళ్ల‌కుండా ప‌ని చేయ‌క‌పోవ‌టం అన్న‌ది లేదు. త‌న నాలుగున్న‌రేళ్ల ప‌ద‌వీకాలంలో మ‌హా అయితే ప‌ది రోజుల కంటే త‌క్కువ రోజులు మాత్ర‌మే సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లార‌న్న ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల్ని కేసీఆర్ త‌న‌దైన శైలిలో కొట్టి పారేశారు. ఈసారైనా స‌చివాల‌యానికి వెళతారా? అన్న అర్థం వ‌చ్చేలా వేసిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చిన తీరు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

అరె.. భ‌య్.. నేను సీఎంను.. నా ఇష్టం. నాకే చెబుతావా? నేను సెక్ర‌టేరియ‌ట్‌ కు వెళ్లాలో వ‌ద్దా అన్న‌ది డిసైడ్ చేసుడేంది? నాకు న‌చ్చితే పోతా.. లేదంటే పోనంతే అన్న రీతిలో గ‌డుసుగానే బ‌దులిచ్చారు. అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న‌.. సీఎం ఎక్క‌డుంటే అక్క‌డే స‌చివాల‌యం అంటూ కొత్త అర్థాన్ని చెప్పుకొచ్చారు. తాజాగా కేసీఆర్ మాట‌ల్ని చూస్తే అర్థ‌మ‌య్యేదేమంటే.. ఈ ట‌ర్మ్‌ లోనూ ఆయ‌న స‌చివాల‌యానికి వెళ్ల‌రంతే. అంతేకాదు.. అలా వెళ్ల‌క‌పోవ‌టాన్ని విమ‌ర్శించే వారి విమ‌ర్శ‌ల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని ఆయ‌న ఆర్డ‌ర్ రూపంలో కొత్త వాద‌న‌ను అందించారు.

ఇక‌పై కేసీఆర్ స‌చివాల‌యానికి వెళ్ల‌ర‌న్న విమ‌ర్శ‌కు పంచ్ ఇచ్చేలా ప‌దునైన వాద‌న‌ను త‌న శ్రేణుల‌కు అందించార‌ని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ఈసారి ట‌ర్మ్‌లోనూ స‌చివాల‌యంలో సీఎం క‌నిపించ‌ని వైనం ఒక సంప్ర‌దాయంగా మారిపోతుందేమో? కేసీఆర్ చెప్పిందే నిజ‌మైతే.. సీఎంవో ఏమిటి? ప్ర‌ధానితో స‌హా.. వివిధ వ్య‌వ‌స్థ‌ల‌కు చెందిన అధిప‌తులు ఆఫీసుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముంది? ఇదే త‌ర‌హాలో ఒక జిల్లా క‌లెక్ట‌ర్ అంటే ఇదే కేసీఆర్ ఒప్పుకుంటారా? అన్న‌ది క్వ‌శ్చ‌న్.

కేసీఆర్ కు ఉన్న‌న్ని తెలివితేట‌లు దేశంలోని ప్ర‌ముఖ కంపెనీల అధిప‌తుల‌కు లేక‌నా? కేసీఆర్ మాదిరే.. తాము ఎక్క‌డ ఉంటే అక్క‌డే ఆఫీసు అనుకోవ‌టం సాధ్య‌మేనా? ఫ్లోలో కేసీఆర్ మాట్లాడేట‌ప్పుడు అవునున్న‌ట్లుగా అనిపించ‌టం.. ఆక‌ర్షితులు కావ‌టం మామూలే. వాటికి లాజిక్కు పాడు లేకున్నా.. స‌మాధాన‌ప‌డేలా ఆయ‌న మాట‌లు ఉంటాయి. కానీ.. ప్రాక్టిక‌ల్ గా అవేమీ వ‌ర్క్ వుట్ కావు. కాకుంటే.. కేసీఆర్ లాంటి తీరున్న అధినేత త‌న‌కు న‌చ్చిందే చేస్తుంటారు. అలాంటి వారి ప‌నుల్ని గొప్ప‌గా చెప్పుకునే అనుచ‌ర‌గ‌ణం పెద్ద ఎత్తున ఉన్న‌ప్పుడు లోపాలు సైతం వారికున్న గొప్ప‌లుగా ప్రొజెక్ట్ అవుతుంటాయి. ఇలాంటి వాటిని కాలం మాత్ర‌మే సెట్ చేయ‌గ‌ల‌దు. అందుకు కేసీఆర్ ఎంత‌మాత్రం మిన‌హాయింపు కాదు.